న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎమ్మెల్యేల పంటపండింది. లెజిస్లేటర్ల వేతనాలు, భత్యాలలో మొత్తం మీద 66 శాతానికి పైగా పెరిగాయి. సంబంధిత ప్రతిపాదనను ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పంపించగా దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఆమోదముద్ర వేశారు. సంబంధిత హెచ్చింపును ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. దీని మేరకు ఇప్పటివరకూ నెలకు రూ 54000 వరకూ వేతన భత్యాలు పొందుతున్న ఢిల్లీ ఎమ్మెల్యే ఇకపై ఇప్పుడు రూ 90,000 అందుకుంటారు. ఇక వేతనాల వారీగా చూస్తే ఎమ్మెల్యేల మౌలికవేతనం ఇప్పటివరకూ రూ 12000 ఉండగా ఇది రూ 30000 కు పెరిగింది.
నియోజకవర్గ అలవెన్స్ ఇంతకు ముందు రూ 18000 ఉండగా ఇది ఇప్పుడు రూ 25000 అయింది. రవాణా భత్యం రూ 6000 నుంచి రూ 10000కు పెరిగింది. టెలిఫోన్ అలవెన్స్ రూ 10000 నుంచి రూ 15000కు చేరింది. ఇక మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్, ప్రతిపక్ష నేత మొత్తం మీద పొందే మొత్తం ఇప్పటివరకూ రూ 72000 ఉండగా ఇప్పుడు ఇది రూ 1.70 లక్షకు చేరింది. వీరి బేసిక్ పే ఇప్పుడు నెలకు రూ 20000 ఉండగా ఇది ఇకపై రూపాయలు 60000 అయింది. వీరి ఇతరత్రా అలవెన్స్‌లు ఇతరత్రా పద్దులు కూడా పెరిగాయి.