న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చిత్ర బృందానికి వైఎస్ జగన్ అభినందనలు తెలియచేస్తూ పోస్టు చేసిన ట్వీట్‌పై అద్నాన్ సమి చేసిన విమర్శలకు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఒక తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మార్చి 13న వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఎస్‌ఎస్ రాజమౌళి, జూనియర్ రామ్‌చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, స్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు మొత్తం చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలు గర్వపడేలా చేశారని ఆర్‌ఆర్‌ఆర్ బృందాన్ని ఆయన అభినందించారు.
దీనిపై అద్నాన్ సమి స్పందిస్తూ జగన్‌ను ప్రాంతీయతత్వంగల చెరువులో కప్పగా అభివర్ణించారు. ప్రాంతీయ చీలికలు తీసుకువస్తున్నారని, ఇది యావత్ భారతదేశానికి దక్కిన గౌరవంగా భావించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగా.. అద్నాన్ సమి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. మాతృభాషకు దక్కిన ఈ గౌరవాన్ని జగన్ ప్రస్తావించారని, ఇది సర్వసాధారణంగా ఎవరైనా చేసే పనేనని ఒక నెటిజన్ పేర్కొన్నారు. తెలుగు భాషను ఈ దేశంలో ఒక భాషగా మీరు గుర్తించరని అద్నాన్ సమిపై ఆ నెటిజన్ మండిపడ్డారు. ఈ దేశం గురించి ఇంకా చాలా తెలుసుకోవలసి ఉంటుందని అద్నాన్ సమికి మరో నెటిజన్ సూచించారు.