హైదరాబాద్: మూడేళ్ల పాటు కలిసి రొట్టె పంచుకున్నారు. కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలిసి సంతోషకరమైన దాంపత్యం సాగించారు. మరి ఉన్నట్లుండి రాత్రికి రాత్రే ఈ బంధాన్ని ఎందుకు తెంచుకోవాలనుకున్నారని వ్యాఖ్యానించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మరి అప్పటి గవర్నర్ ఈ విషయాలను ఎందుకు బేరీజు వేసుకోలేదని ప్రశ్నించారు. గవర్నర్ పలు విషయాలను పరిశీలించుకుని ఉండాల్సింది. అధికారంలోని పార్టీలో తలెత్తిన స్వల్ప అసంతృప్తిని ప్రాతిపదికగా తీసుకుని విశ్వాసపరీక్షకు పిలుపు నివ్వడం సమంజసం కాదన్నారు.
మూడేళ్లుగా కలిసి ఉండి అంతా సవ్యంగా ఉన్నప్పుడు హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు ఏమిటీ? దీని వెనుక ఏమి ఉండి ఉంటుంది? తాను ఏ మేరకు స్పందించవచ్చు అనే విషయాలను గవర్నర్ జాగ్రత్తగా పరిశీలించుకుని ఉండాల్సిందని తెలిపారు. మూడేళ్లు కలిసి ఉండి ఉన్నట్లుండి 34 మంది తాము అసంతృప్తితో ఉన్నామని చెప్పడం భావ్యం అవుతుందా? వారు వేరే పార్టీలో చేరి ధిక్కరించి ఉంటే అది వేరే విషయంగా ఉండేదని, అంతవరకూ అధికార ఫలాలు అనుభవించి ఉన్నట్లుండి తాము బాగాలేమని చెప్పడం ఏమిటీ? దీనిని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవడం ఏమిటీ? అని ప్రశ్నించారు.