నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన అవినాష్ కొల్లా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దసరా కథా నేపధ్యం పూర్తిగా భిన్నమైనది. ఇందులో తెలంగాణలోని ఒక ఊరికి సంబంధించిన కల్చర్, అలవాట్లు, కట్టుబాట్లు వుంటాయి. ఆ ఊరికి కోల్‌మైన్ దగ్గరగా వుండటం వలన పెద్దపెద్ద వాహనాలు ఊరి నుంచే వెళ్తాయి.
నానితో జర్నీ చాలా బావుంది. నాకు పేరు వచ్చే కంటెంట్ వున్న సినిమాలు నాని వల్లనే వచ్చాయి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నా వంతు న్యాయం చేస్తున్నాను. నాని ఇదివరకు సినిమాలతో పోల్చుకుంటే దసరా చాలా డిఫరెంట్ మూవీ. ఒక పాతికేళ్ళ క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. దాని కోసం అడవి లాంటి ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని భారీ విలేజ్ సెట్ వేశాం. ఇల్లు, స్కూల్, ఒక మైదానం, బార్… ఇలా ఒక ఐదు వందల మంది నివసించే గ్రామాన్ని సహజంగా సృష్టించాము. 98 శాతం షూటింగ్ సెట్ లోనే జరిగింది. శ్రీకాంత్‌ది తెలంగాణ నేపధ్యం. తన ఊరు గురించే కథ రాసుకున్నాడు. తొలిసారి దర్శకత్వం చేస్తున్నప్పటికీ అన్ని విషయాలపై చాలా క్లారిటీ వుంటుంది. తన కథకి ఏం కావాలో అతనికి చాలా బాగా తెలుసు. ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్‌ల సినిమా, నాని 30వ మూవీ, ఏజెంట్ సినిమాలు చేస్తున్నాను” అని అన్నారు.