Saturday, November 23, 2024

సిఎం కెసిఆర్ నిర్లక్ష్యమే టిఎస్‌పిఎస్‌సి పేపర్‌ లీక్‌

- Advertisement -
- Advertisement -

గొల్లపల్లిః సిఎం కెసిఆర్ నిర్లక్షం కారణంగానే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిరసన వ్యక్తం చేస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైటాయించి సిఎం దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత బలిదానాలు చేసుకుంటే ఈ పేపర్ లీకేజ్ చాలా దౌర్భాగ్యకరమన్నారు. నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల సాధన కోసం వేల రూపాయలు ఖర్చు చేసి సిద్దమవుతుంటే, మరో వైపు పేపర్ లీకేజీలు చేస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి, పగలు కష్టపడి చదివిన పేద, మధ్య తరగతి నిరుద్యోగుల పాలిట సిఎం కెసిఆర్ పాలన శాపంగా మారిందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టిఎస్‌పిఎస్‌సి బోర్డు చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి, బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా జరిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు రేవల్ల సత్యం గౌడ్, సరసాని తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ ఉప సర్పంచ్‌లు కొండ వెంకటేష్‌గౌడ్, హరికిరణ్, శ్రీధర్, సీనియర్ నాయకులు రాజారావు, రామాగౌడ్, రామ్‌మోహన్‌రెడ్డి, కొమురయ్య, గంగాధర్,రమేష్, విజయ్, సత్తయ్య, దిలీప్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News