Saturday, November 23, 2024

ప్రజాస్వామ్య దిక్సూచి

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: మహారాష్ట్రలో అధికార మార్పిడిపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం నాడు చేసిన వ్యాఖ్య గవర్నర్లు విధిగా పోషించాల్సిన నిర్మాణాత్మక పాత్రను గురించి నొక్కి చెప్పింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ విధులను పక్కన పెట్టి కేంద్ర పాలకుల రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరించడం హద్దు మీరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య అవసాన దశకు చేరుకొంటున్నదనే భయాన్ని కలిగిస్తున్న ప్రజాస్వామ్యం నోట పోసిన అమృతం వంటిదని చెప్పవచ్చు. గవర్నర్లు ఎన్నికైన ప్రభుత్వాలు కూలిపోయేందుకు ఎంత మాత్రం దోహదం చేయరాదని, అధికారంలోని వారిని విశ్వాస పరీక్షకు ఆదేశించడమే శాసన సభలో వారు మెజారిటీ కోల్పోయే పరిస్థితిని సృష్టించవచ్చునని ఈ వాస్తవాన్ని గుర్తించి మెసులుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ వెలిబుచ్చిన అభిప్రాయం గవర్నర్ల నుంచి రాజ్యాంగం ఏమి ఆశిస్తున్నదో వివరించింది.

గవర్నర్లు తమ అధికారాలను ఒక ప్రత్యేక ఫలితం కలిగేలా దుర్వినియోగ పడనివ్వరాదని ఆయన హితవు పలికారు. తన కారణంగా ప్రభుత్వం పడిపోయే స్థితి బలపడగల కార్యక్షేత్రంలోకి వారు అడుగు పెట్టరాదని సుబోధకంగా తెలియజేశారు. గత జూన్‌లో శివసేనలో సంక్షోభం తలెత్తి ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసినప్పుడు విశ్వాస పరీక్షకు నిలబడాలని అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను అప్పటి గవర్నర్ ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదంటూ 34 మంది శాసన సభ్యులు ఒక తీర్మానాన్ని ఆమోదించినంత మాత్రాన విశ్వాస పరీక్షకు ఆదేశించడమేనా అని జస్టిస్ చంద్రచూడ్ అడిగారు. శివసేనలోని ఉద్ధవ్ థాక్రే శిబిరానికి ఏక్‌నాథ్ షిండే వర్గానికి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయని, కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల శివసేన మౌలిక సిద్ధాంతానికి హాని కలిగిందని ఆ విధంగా ఉద్ధవ్ థాక్రే పార్టీ సిద్ధాంతానికి మోసం చేశారని షిండే వర్గం భావించినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా గవర్నర్ కార్యాలయం ఇచ్చిన వివరణకు సుప్రీంకోర్టు అభ్యంతరం తెలపడం సహేతుకంగా వుంది.

మూడేళ్ళ పాటు కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలిసి ఒకే కంచంలో భోజనం చేసిన తర్వాత ఉన్నపళంగా ఏమైందని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. తిరుగుబాటు ఎంఎల్‌ఎల ప్రాణాలకు ముప్పు తలెత్తిందనే కారణం చూపినందున ప్రభుత్వాన్ని కూల్చి వేయవలసిన పని లేదని ఆ విషయమై పోలీసులను ఆశ్రయిస్తే సరిపోతుందని చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం భావించింది. ఇలా తొందరపడి విశ్వాస పరీక్షకు పిలవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని గవర్నర్లు తమ అధికారాలను అత్యంత విచక్షణతో వినియోగించాలని చంద్రచూడ్ వెలిబుచ్చిన అభిప్రాయం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడదలచిన గవర్నర్లకు శిరోధార్యమైనది.

ఫిబ్రవరి నెలలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలలో అస్థిరత్వాన్ని సృష్టించేలా గవర్నర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఉద్ధవ్ థాక్రే వర్గం వాదించింది. ఆయన ఏ పార్టీకి చెందిన వారో తెలుసుకోకుండా ఏక్‌నాథ్ షిండే చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ చేయించకుండా వుండవలసిందని ఆ వర్గం తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అసలు ఏ హోదాలో ఏక్‌నాథ్ షిండే గవర్నర్‌ను కలుసుకున్నారని ప్రశ్నించారు. ఆయన మీద ఫిరాయింపుల కింద శాసన సభ్యత్వ రద్దు ప్రక్రియ కొనసాగుతున్న దశలో షిండేకు తనను కలుసుకొనే అవకాశాన్ని గవర్నర్ ఇవ్వకుండా వుండాల్సిందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇలాగే జరిగిందని గవర్నర్లు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరుస్తున్నారని ఆయన వాదించారు.

షిండే వర్గం చీలిపోయి వేరే పార్టీలో విలీనం కాలేదని అందుచేత పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారికి ఎటువంటి రక్షణ లభించదని కూడా అన్నారు. శాసన సభ్యుల మీద వారి పార్టీ నాయకత్వానికి ఆధిపత్యం వుంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, ఎన్‌సిపిలతో కలవడం ద్వారా శివసేన పార్టీ సిద్ధాంతానికి ఉద్ధవ్ హాని చేసినట్టు షిండే వర్గం భావించినప్పుడు పార్టీ నాయకత్వం నుంచి ఆయనను తొలగించి వుండవలసిందని, అలా జరగకుండా కొన్ని విషయాలపై పార్టీ నాయకత్వం పట్ల అసమ్మతి నెలకొన్నదనే కారణం చూపి గవర్నరే విశ్వాస పరీక్షకు తెర లేపడం ఎంత వరకు సమంజసమని బుధవారం నాటి విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఒక విలువైన ప్రశ్నను సంధించారు. దీనిని బట్టి ఒక అధికార పార్టీలో కొంత మంది కూడబలుక్కొని తాము పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి దూర ప్రాంతాలకు ఎంఎల్‌ఎలను తరలించుకుపోయి శిబిరాలు ఏర్పాటు చేసి గవర్నర్ సాయంతో ప్రభుత్వాన్ని పడదోయడం అనుచితమని, అది చెల్లదని భావించడానికి బుధవారం నాటి సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయి. అంతిమ తీర్పు ఇదే విషయాన్ని ధ్రువపరిస్తే మహారాష్ట్రలో మరో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News