గౌహతి: అస్సాంలో అన్ని మదర్సాలు మూసేస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ అన్నారు. అస్సాంలో అందరూ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుకోడానికి ప్రాముఖ్యతనిస్తున్నారని ఆయన తెలిపారు. ‘నేను ఇప్పటికే 600 మదర్సాలు మూయించేశాను. మిగతా అన్నింటినీ మూయించేందుకు సిద్ధంగా ఉన్నాను. మాకు మదర్సాలు వద్దు. మాకు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కావాలి’ అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరుగనున్న కర్నాటకలోని బెల్గావిలో గురువారం ఆయన బిజెపి ‘విజయ్ సంకల్ప్ యాత్ర’ ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.
అస్సాంలో 2023 జనవరి నాటికి నమోదైన, నమోదు కాని మదర్సాలు 3000 ఉన్నాయి. ఇప్పుడున్న మదర్సాలన్నీ ‘రెగ్యులర్ స్కూల్స్’గా మారుస్తామన్నారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమ వలసలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. దీంతో అస్సాం నాగరికతకు, సంస్కృతికి ముప్పు ఏర్పడుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఆయన కాంగ్రెస్ పార్టీని మొగల్స్‌తో పోల్చారు. వారు దేశాన్ని బలహీనపరుస్తున్నారన్నారు. బాబ్రీ మస్జిద్ వివాదాన్ని వారు మళ్లీ లేవనెత్తుతున్నారు. అయోధ్యలో రాముడి మందిరం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.