న్యూఢిల్లీ: లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. దీని వల్ల ప్రభుత్వ ధనం వృథాకాకుండా నివారించడంతోపాటు ఆదా చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడాల్చాలంటే రాజ్యాంగ సవరణ చేయడం, అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడం వంటి అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక లిఖితపూర్వక సమాధానమిస్తూ లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘంతోసహ వివిధ భాగస్వామ్య పక్షాలతో పార్లమెంటరీ కమిటీ సంప్రదింపులు జరిపి కొన్ని సిఫార్సులు చేసిందని తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను, రోడ్ మ్యాపును రూపొందించేందుకు ఈ అంశాన్ని న్యాయ కమిషన్‌కు నివేదించడం జరిగిందని ఆయన చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతోపాటు పాలనా యంత్రాంగం, శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగంపై పని భారాన్ని నివారించవచ్చని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార ఖర్చులను తగ్గించుకోవచ్చని రిజిజు తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణ ఆచరణసాధ్యం కావాలంటే రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఆర్టికల్ 83, 85, 172, 174, 356 సవరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదన అమలులోకి తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం అవసరమని ఆయన అన్నారు. అంతేగాక జబిలి ఎన్నికల కోసం అదనంగా పెద్ద సంఖ్యలో ఇవిఎంలు, వివిప్యాట్‌లు అవసరమవుఆయని, ఇందుకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రిజిజు తెలిపారు.