Monday, December 23, 2024

తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ‘పిఎం మిత్ర మెగా టెక్స్‌టైల్స్ పార్క్’ను ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కులలో తెలంగాణకు చోటు కల్పించారు. దీంతో లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నదని కేంద్రమంత్రి వెల్లడించారు. వేలాది మంది యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రికి ధన్యవాదాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా టెక్స్‌టైల్స్ రంగంలో దేశంను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఉద్దేశంతో ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ రీజియన్ & అపారెల్ పార్క్’ ( పిఎం మిత్ర) పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.

ఈ పథకంలో భాగంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ 7 మెగా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రధానమంత్రి తెలంగాణకు అందించిన కానుక అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణపేట చీరలు, సిద్దిపేట గొల్లభామ, దుర్రీలు వంటి జిఐ ట్యాగ్ కలిగి ఉన్న ఎన్నో చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుతో రైతులకు, చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ‘పిఎం -మిత్ర’ ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ గతేడాది ఫిబ్రవరిలో సిఎం కెసిఆర్‌కు లేఖ రాసినట్లు కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ మెగా టెక్స్‌టైల్ పార్కులో దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వస్త్రాల తయారీ వరకు అన్ని రకాల పనులు ఒకే ప్రదేశంలో నిర్వహించేలా ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన భారీ వస్త్ర పరిశ్రమలను ఏర్పాటు చేస్తారన్నారు. ఈ మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు వలన రవాణా ఖర్చులు తగ్గి, భారతీయ టెక్స్‌టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు విషయంలో ప్రత్యేక చొరవను చూపించి, అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు.
ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డికి అభినందనలు..
మహబుబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి- ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి ఎవిఎన్ రెడ్డిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఎవిఎన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు అని కేంద్రమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో బిజెపికి పెరుగుతున్న ఆదరణకు ఈ విజయం నిదర్శనమన్న కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం..
కల్వకుంట్ల కుటుంబంలో అభద్రతాభావం పెరిగిపోతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. అరాచక, నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడతారంటూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News