ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాత్ సే హాత్ జోడో పాద యాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హాత్‌సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఇచ్చోడ నుంచి సిరికొండ వరకు పాద యాత్ర చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణతో పేగు బంధం ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలు చిరకాల స్వప్నం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. టిఆర్ ప్రభుత్వ నిర్లక్షంతో రైతులు వ్యవసాయం బంద్ చేసి భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిజాంషుగర్ ఫ్యాక్టరీలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్ వాటిని మూతబడేలా చేశారని ఎద్దేవా చేశారు.
ప్రజల ఆస్తులు, దేశ సంపదను తన స్నేహితుడైన అదానీకి ప్రధాని మోడీ దోచిపెడుతున్నారని అన్నారు. అదానీ కేవలం పదేళ్లలోనే ప్రపంచంలోనే కుబేరుడిల జాబితాలో చేరారని దానికి ప్రధాని మోడీ సహకరించాడని ఆరోపించారు. దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపడితే, రాష్ట్రాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో ద్వారా పాదయాత్రను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఈ ప్రభుత్వాలను ప్రజలు బంగాళాఖాతంలో తొక్కేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాజీద్ ఖాన్, బోథ్ బ్లాక్ అధ్యక్షులు మైముద్ ఖాన్, కళ్లెం నారాయణ రెడ్డి, గండ్రత్ సుజత, ఆడే గజేందర్, జాన్టీ, వెన్నెల అశోక్, కంచం లక్ష్మణ్, సాదుల్లా, మాధవ్ పటేల్, కార్యక ర్తలు పాల్గొ న్నారు.