Tuesday, December 24, 2024

ఉల్లంఘనలే ఊపిరితీశాయ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను జిహెచ్‌ఎంసి అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ నాణ్యతపై పరిశీలన చేసి రిపోర్టు ఇవ్వాలని జెఎన్‌టియూ ఇంజనీర్లను జిహెచ్‌ఎంసి కోరింది. ఇంజనీర్లు రిపోర్టు ఇచ్చే వరకు కాంప్లెక్స్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం సమయంలో కాంప్లెక్స్‌లో చిక్కుకున్న ఉద్యోగులు ఊపిరిఆడక మరణించారు. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా, సురేష్‌నగర్‌కు చెందిన ప్రమీల(22), కేసముద్రానికి చెందిన ప్రశాంత్(23), వరంగల్ జిల్లా, మర్రిపల్లికి చెందిన వెన్నెల(22), నర్సంపేటకు చెందిన శివ(22), నర్సంపేట మండలానికి చెందిన శ్రావణి(22), ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన త్రివేణి(22) మృతిచెందారు. వీరు క్యూనెట్‌కు సంబంధించిన కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న శ్రావణ్, భారతమ్మ, సుధీర్‌రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య,రవిని అగ్నిమాపక సిబ్బందిని రక్షించారు. అగ్నిప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అన్ని లోపాలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఎక్కడా కాంప్లెక్స్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ గురించి జాగ్రత్తలు తీసుకోని విషయం బయటపడింది. నిర్వాహకులు కాంప్లెక్స్‌ను 1985లో నిర్మించారు, కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనల ప్రకారమే చేశారు కానీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇటీవలి కాలంలో నగరంలో వరుసగాఅగ్నిప్రమాదాలు జరుగుతున్నా కాంప్లెక్స్ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, దీనిపై అగ్నిమాపక శాఖ అధికారులు గతంలో నోటీసులు జారీ చేసినా కూడా వాటిని కాంప్లెక్స్ నిర్వాహకులు పట్టించుకోలేదు. అంతేకాకుండా మెట్ల మార్గం కాంప్లెక్స్‌లో పూర్తిగా మూసివేసినట్లు తెలిసింది. మృతిచెందిన వారు ఉన్న ఐదోఅంతస్థులో మెట్ల మార్గం ఉన్న ప్రాంతంలో గేట్ పెట్టి తాళం వేయడంతో కిందికి వచ్చేందుకు వీలులేక ఆరుగురు మృతిచెందారు. అగ్ని ప్రమాదం, షార్ట్ సర్కూట్ జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది, దీని వల్ల పై అంతస్థుల్లో చిక్కుకున్న వారు కిందికి వచ్చేందుకు ఏకైక మార్గం మెట్లు వాటిని ఎప్పుడు తెరిచి ఉంచాలని అగ్నిమాపక శాఖ అధికారులు కాంప్లెక్స్‌ల నిర్వాహకులకు ఎప్పుడూ సూచిస్తున్నారు. కానీ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మెట్ల మార్గం పూర్తిగా మూసివేయడంతో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలులేకుండా పోయింది.

మృతులు క్యూ నెట్ ఉద్యోగులు…
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఆరుగురు క్యూనెట్ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఐదో ఫ్లోర్‌లో క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న క్యూనెట్ కాంప్లెక్స్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. మృతిచెందిన వారు అందులోనే టెలీకాలర్స్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఈడి క్యూనెట్‌కు సంబంధించిన ఆస్తులను అటాచ్డ్ చేసింది. అయినా కూడా వ్యాపారం చేస్తున్నారు,అగ్నిప్రమాదం జరగడంతో క్యూ నెట్ బాగోతం మరోసారి బయటపడింది.

నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోంది: నాగిరెడ్డి, ఫైర్ డిజి
సెల్లార్‌లో వైర్లు కాలి 4, 5, 6 , 7 ఫ్లోర్లకు మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షార్ట్ సర్కూట్‌గా తెలిపారు. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పెట్టినా అవి పని చేయడంలేదని తెలిపారు. బిల్డింగ్ లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉండడంతో ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగామని అన్నారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీని మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలని సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు మెట్ల మార్గాన్ని లాక్ చేయకూడదని, చనిపోయిన వాళ్లు ఉన్న ప్రాంతంలో మెట్ల మార్గం తాళాలు వేసి ఉండటంతో వాళ్లు బయటపడలేక పోయారని తెలిపారు. వ్యాపారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు మెయింటేన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్ వారికి నోటీసులు ఇచ్చినా వాటిని, నిబంధనలు పాటించాలేదని అన్నారు. కాంప్లెక్స్ నిర్వాహకులు లిఫ్ట్ తోపాటు, మెట్ల దారిని కూడా తెరచి ఉంచాలని చెన్నారు. ఏ కాంప్లెక్ లో అయినా మెట్ల దారిని లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలి, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే నగరంలో 1150 ఎస్టాబ్లిష్ మెంట్ల అగ్నిమాపక శాఖ పరిశీలన చేశామని అన్నారు.

కేసు నమోదు చేసిన మహాంకాళి పోలీసులు
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంపై మహాంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు. 49/2023 U/s 304 పార్ట్-II, 324, 420 ఐపీసీ, సెక్షన్.9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసు నమోదు చేశారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేడియా ఇన్ఫోటెక్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్ నుంచి మంటలు, పొగలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ మంటలు భవనంలో 5వ అంతస్తులోకి వ్యాపించాయి. అక్కడ ఉన్న క్యూనెట్ , విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి చేరడంతో అక్కడ పనిచేస్తున్న వారు అగ్నిప్రమాదం వల్ల ఊపిరిఆడక మృతిచెందారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే 12 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చి పలువురిని ఫైర్ సిబ్బంది రక్షించారు.

అనంతరం పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులు మిస్ అయ్యారని అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి చెప్పడంతో రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 5వ అంతస్తుకు వెళ్లారు అగ్ని మాపక సిబ్బంది, అప్పటికే ఆరుగురు అపస్మారకస్థితికి చెరుకోవడంతో కిందికి తీసుకుని వచ్చి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన డ్యూటీ డాక్టర్ పొగ వల్లే చనిపోయారని నిర్ధారించారు. ఈ క్రమంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్నలోక్ సూర్యకిరణ్ ఎస్టాబ్లిష్మెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్, వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరంః మహ్మద్‌అలీ, హోంమంత్రి
స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన ఆరుగురి కుటుంబ సభ్యులను తెలంగాణా రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ పరామర్శించారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. అగ్నిప్రమాదం నివారణకు సరైన జాగ్రత్తలు పాటించని భవన, గోదాముల నిర్వహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాంప్లెక్స్ ను సీజ్ చేస్తాంః శ్రీలతశోభన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్
అగ్ని ప్రమాదం లో మరణించిన కుటుంబ సభ్యులను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి పరామర్శించారు స్వప్న లోక్ కాంప్లెక్స్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్ రెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో చిన్న వయస్సు వారు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మృతి తీరని విషాదం నింపిందన్నారు ,ప్రమాద ఘటన పై కమిటీ వేస్తున్నామని, క్లూస్ టీమ్ అధికారులు కాంప్లెక్స్‌లోని అని అంతస్తులలో నమూనాలు సేకరిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు,మూడు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. 4, 5 అంతస్థులు పూర్తిగా దహనం అయ్యాయి,7,8 అంతస్తులు కూడా కొంత దెబ్బ తిన్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని డిప్యూటీ మేయర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News