పంజాబ్‌లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సస్పెండ్
అమృత్‌సర్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు(సింపథయిజర్) అమృత్‌పాల్ సింగ్‌ను, అతడి సహచరులను అరెస్టు చేయడానికి పంజాబ్ పోలీసులు ఆపరేషన్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్ అంతటా ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. గతవారం అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లో చాలా క్రియాశీలకం అయ్యాడు. అమృత్‌సర్ శివారుల్లోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల అతడి సహచరులు, మద్దతుదారులు పోలీసులతో బాహాబాహికి దిగారు. నిర్బంధంలో ఉన్న అమృత్‌పాల్ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులతో అతడి అనుచరులు తలపడుతున్న వీడియోలు ఇంటర్నెట్‌లో కూడా దర్శనమిచ్చాయి.
పంజాబ్‌లో ఇంటర్నెట్ రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు శాంతి, సామరస్యాలు కాపాడాలని, భయాందోళనలు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు వ్యాపింపచేయొద్దని కోరారు. మార్చి 18న మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 19 మార్చి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పంజాబ్ పరిధిలో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.