న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే మరి న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరు ? అని ప్రశ్నించారు. కార్యనిర్వాహక , న్యాయవ్యవస్థలు ఏమీ చేయాలన్న దానిపై రాజ్యాంగ ‘లక్ష్మణరేఖ స్పష్టంగా ’ పేర్కొందని తెలిపారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ముఖ్యఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక విషయంలో ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి , లోక్‌సభలో ప్రతిపక్ష నేత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ‘ఇండియా టుడే ’ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. దీనిపై పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది.
దానికి అనుగుణంగా నియామకాలు జరగాల్సి ఉంది. అయితే పార్లమెంట్ అలాంటి చట్టం చేయలేదు. ఆ విషయంలో శూన్యత ఉందని అంగీకరిస్తున్నా. ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పును తప్పుబట్టడం లేదు. కానీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు దేశంలోని కీలక నియామకాల విషయంలో జోక్యం చేసుకుంటుంటే …న్యాయ వ్యవహారాలు ఎవరు చూస్తారు?” అని ప్రశ్నించారు. “ దేశంలో పాలనా పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా, న్యాయమూర్తుల ప్రాథమిక విధి న్యాయ, వ్యవహారాలు చూడడం. తీర్పులు వెలువరించడం… ప్రజలకు న్యాయం చేయడం” అని రిజిజు అన్నారు. పాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయమూర్తులు జోక్యం వల్ల వారిపై విమర్శలు వస్తాయని రిజిజు అన్నారు. కేసుల విచారణ సమయంలో న్యాయ సూత్రాల విషయంలో రాజీ పడాల్సి వస్తుందన్నారు. “ ఒకవేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి పాలనా పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. రేప్పొద్దున్న అదే వ్యవహారం కోర్టుకు చేరినప్పుడు ఆ నియామకంలో భాగస్థులైన న్యాయమూర్తులు తీర్పులు ఎలా వెలువరిస్తారు?” ఇది న్యాయసూత్రాల విషయంలో రాజీ పడడం కాదా ? ఇదే విషయాన్ని రాజ్యాంగ లక్ష్మణ రేఖ స్పష్టంగా పేర్కొంది ” అని రిజిజు అన్నారు.