Thursday, December 26, 2024

కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లేకుండా ఏ ప్రతిపక్ష కూటమి కూడా సాధ్యం కాదని,ఒక వేళ 2024 లోక్‌సభ ఎన్నికలకోసం విపక్ష కూటమి ఏర్పాటయితే దానిలో కాంగ్రెస్ పార్టీకి కీలక పాత్ర ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జై రామ్ రమేశ్ స్పష్టం చేశారు. అయితే దీని గురించి మాట్లాడడం తొందరపాటవుతుందని, కాంగ్రెస్ పార్టీ తొలి ప్రాధాన్యత కర్నాటకతో పాటుగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలేనని పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వూలో జైరాం రమేశ్ స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్, బిజెపి రెండింటికీ దూరంగా ఉంటామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చెప్పడంతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపనున్నట్లు సంకేతాలు ఇచ్చిన రెండు రోజలు తర్వాత జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టిఎంసి, సమాజ్‌వాది పార్టీ చర్యలు విపక్షాల ఐక్యతకు విఘాతం కలిగిస్తుందా అని అడగ్గా, ‘టిఎంసి, సమాజ్‌వాది పార్టీ, ఇతరులు భేటీలు జరుపుతూ ఉండవచ్చు, తృతీయ ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ ఇలా ఎన్ని కూటములయినా ఏర్పాటు కావచ్చు. అయితే ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఉండడం అవసరం’ అని ఆయన అన్నారు.

ఒక వేళ ప్రతిపక్షాల కూటమి ఏర్పాటయితే కాంగ్రెస్ పార్టీ దానిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ లేకుండా ఏ కూటమికూడా సాధ్యం కాదు. అయితే దీని గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు’ అని జైరాం రమేశ్ అన్నారు. ముందుగా కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాని తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో ఎన్నికలున్నాయి అని ఆయన అన్నారు. ఈ ఏడాది అంతా కూడా తాము రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉంటామని, ఆ ఎన్నికల తర్వాతమాత్రమే 2024 ఎన్నికల గురించి తాము ఆలోచిస్తామని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భేటీలు కొనసాగుతుంటాయని, రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉంటాయని మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్… అయిదో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే ఉంటారని ఆయన కాస్త వ్యంగ్యంగా అన్నారు. ఏ ప్రతిపక్ష కూటమికయినా సరే బలోపేతమైన కాంగ్రెస్ అవసరమని రమేశ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి పార్టీ ప్రాధాన్యత కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలేనని కూడా ఆయన వెల్లడించారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలనే దానిపై మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర సీనియర్ నేతలు నిర్ణయిస్తారని, పార్టీలతో చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు. అదానీ అంశంపై ప్రతిపక్షాలు జరిపే ఆందోళనలకు టిఎంసి దూరంగా ఉండడం, ఎన్‌సిపి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వకపోవడం, ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసిందాఅని అడగ్గా తాను అలా అనుకోవడం లేదని జైరాం రమేశ్ అన్నారు. టిఎంసికి దాని సొంత వ్యూహం ఉండవచ్చునని అంటూ దీనిపై ంతకు మించి ఎలాంటి వ్యాఖ్యా చేయబోనని అన్నారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలనే అంశంపై 16 రాజకీయ పార్టీల ఐక్యంగా ఉన్నాయని చెప్పారు. ఇడి డైరెక్టర్‌కు రాసిన లేఖపై ఎన్‌సిపి సంతకం చేయలేదు కానీ వాళ్లు భౌతికంగా కాకపోయినా స్ఫూరిలో తమతోనే ఉన్నారని జైరాం రమేశ్ చెప్పారు.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ జెపిసికి ప్రత్యామ్నాయం కాబోదని ఆయన స్పష్టం చేశారు. ‘రాజకీయ, ఆర్థిక కోణాలు కలిగిఉన్న ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని కోణాలను బైటపెట్టాలంటే జెపిసి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. ప్రస్తుతానికి జెసిసిని ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ నెరవేరేలా చూడడంపైనే కాంగ్రెస్ దృష్టిపెట్టిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ అంశంనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అధికార పక్షం అకస్మాత్తుగా రాహుల్ గాంధీ లండన్ ప్రసంగం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆయన అంటూ కాంగ్రెస్ పార్టీ దీన్ని తిప్పికొడుతుందని ఆయన అన్నారు.

అదానీ అంశం క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుతుందా అని అడగ్గా, మనం చేయాల్సింది చేయాలి కదా? అని జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంటులో తమ వాదనలను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. పార్లమెంటులో చర్చలకన్నా కూడా వాయిదాల పర్వం కొనసాగుతోందన్నారు. పార్లమెంటు సమావేశాలను సాఫీగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదని ఆయన అంటూ, అయితే సభ జరగడం అధికార పార్టీకే ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందని జైరాం రమేశ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News