Sunday, January 19, 2025

కేంద్రం నియంతృత్వంపై రెండ్రోజుల నిరసన: మమత

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకు తాను రెండ్రోజుల పాటు నిరసన చేపట్టనున్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్ పట్ల కేంద్ర వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. దీనిపై ఈనెల 29 నుంచి రెండు రోజుల పాటు కోల్‌కతాలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టనున్నట్టు మంగళవారం డమ్‌డమ్ విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరుతూ మీడియాతో చెప్పారు. ‘వంద రోజుల పనిదినాలకు కేంద్ర డబ్బులు ఇవ్వడం ఆపేసింది. బడ్జెట్‌లో కూడా బెంగాల్‌కు ఇచ్చిందేమీ లేదు.

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణపై అంబేద్కర్ విగ్రహం ముందు ఈనెల 29, 30 తేదీల్లో నేను నిరసనకు దిగుతున్నాను’ అని మమతా బెనర్జీ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా పలు సాంఘిక సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో పశ్చిమబెంగాల్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు.

పాలకుల మిత్రులు కాబట్టే..
మెహుల్ చోక్సీ పేరును ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్ నుంచి తొలగించడంపై అడిగిన ప్రశ్నకు మమతా బెనర్జీ సమాధానమిస్తూ.. దేశాన్ని పాలిస్తున్న వారికి అదానీ, మెహుల్ చోక్సీలు మిత్రులని, బిజెపి కొద్ది మంది కోసమే పనిచేస్తోందని అన్నారు. దీనికి ముందు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13,000 కోట్ల రూపాయల కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఉన్న రెడ్‌కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ఎత్తేసింది. డేటాబేస్ నుంచి ఆయన పేరును తొలగించినట్లు ఇంటర్‌పోల్ తెలిసింది. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయంలో చోక్సీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై విపక్షాలు సీబీఐ, కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మోడీ మిత్రులపై అయితే కేసులు ఎత్తేస్తారని, వ్యతిరేకులపై దాడులు జరుపుతారని పలువురు విపక్ష నేతలు విమర్శలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News