వాషింగ్టన్: భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ అని వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది. అయితే ఈ పార్టీపై అవగాహన చాలా తక్కువగా ఉందని తెలిపింది. వాల్టర్ రసెల్ మీడ్ ఈ వ్యాసాన్ని రాశారు. “అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, భారత దేశ అధికార పార్టీ బిజెపి ప్రపంచంలో చాలా ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ. దీనిపై చాలా తక్కువ అవగాహన ఉంది” అని ఈ వ్యాసం పేర్కొంది.
2014-2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బిజెపి, 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్‌తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్‌లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని పేర్కొంది.భారత దేశంలో సమీప భవిష్యత్తులో ప్రభావితం చేయగలిగే నిర్ణయాలు తీసుకునే సత్తా బిజెపికి ఉందని, పెరుగుతున్న చైనా శక్తి, సామర్థ్యాలను దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోందని, భారత దేశం సహాయం లేకుండా ఈ ప్రయత్నాలు లక్ష్య సాధనకు సరిపోవని తెలిపింది.
బిజెపి గురించి తెలియకపోవడానికి కారణాలు..
బిజెపి గురించి ప్రపంచానికి అవగాహన చాలా తక్కువగా ఉందని ఈ వ్యాసం పేర్కొంది. భారతీయులు కానివారిలో చాలా మందికి తెలియని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి ఈ పార్టీ వృద్ధి చెందిందని, దీని గురించి తెలియకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఒకప్పుడు అస్పష్టంగా, నామమాత్రంగా ఉన్న ఓ సాంఘిక ఉద్యమం సాధించిన విజయం ఎన్నికల్లో బిజెపి ఆధిక్యతలో ప్రతిబింబిస్తుందని తెలిపింది. తరతరాలుగా సామాజికవేత్తలు, ఉద్యమకారులు చేసిన కృషి ఆధారంగా జాతీయ పునరుజ్జీవం జరగాలనేది ఈ సాంఘిక ఉద్యమమని తెలిపింది.
ఆధునికతకు విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించడం కోసం సామాజిక ఆలోచనపరులు, ఉద్యమకారులు తరతరాలపాటు కృషి చేశారని పేర్కొంది. అధికార పక్షాన్ని విమర్శించే పాత్రికేయులు వేధింపులకు గురవుతుండటం, మైనారిటీలపై మూకదాడులు జరుగుతుండటం, మత మార్పిడులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలు, ఆర్‌ఎస్‌ఎస్ గురించి భయాలు వంటి ఆందోళనకరమైన అంశాలను అమెరికన్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నప్పటికీ, భారత దేశం చాలా సంక్లిష్టమైనదని, అక్కడ ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈశాన్య భారత దేశంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిజెపి ఇటీవల రాజకీయంగా విజయాలు సాధించిందని తెలిపింది. బిజెపి ఇటీవలి కాలంలో సాధించిన విజయాల్లో చాలా ముఖ్యమైన విజయం ఇది అని వివరించింది. రూ.20 కోట్ల జనాభాగల ఉత్తర ప్రదేశ్‌లో షియా ముస్లింల మద్దతు ఆ పార్టీకి ఉందని పేర్కొంది. కుల వివక్షపై పోరాటంలో ఆరెస్సెస్ కార్యకర్తలు చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది.
“సీనియర్ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో, అదేవిధంగా, వారి విమర్శకులతో, అనేకసార్లు సమావేశమైన తర్వాత, ఓ సంక్లిష్టమైన, శక్తిమంతమైన ఉద్యమం గురించి అమెరికన్లు, పాశ్చాత్యులు మరింత ఎక్కువగా తెలుసుకోవలసిన అవసరం ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను” అని ఈ వ్యాస రచయిత వాల్టర్ రసెల్ మీడ్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఆరెస్సెస్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పౌర సమాజ సంస్థగా ఎదిగిందన్నారు.