మనతెలంగాణ/హైదరాబాద్ : భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. రాములోరి తలంబ్రాలు కావాలనుకునే వారు ఈ నెల 28వ తేదీ వరకు బుక్ చేసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. తలంబ్రాలతో పాటు రెండు రకాల ప్రసాదాలను అందజేయనున్నట్లు తపాలా శాఖ స్పష్టం చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో ఈ నెల 30వ తేదీన జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తపాలా శాఖ నిర్ణయించింది. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ తలంబ్రాలను భక్తులకు టిఎస్ ఆర్టీసి హోం డెలివరీ చేస్తుందని తపాలా శాఖ పేర్కొంది.
10 గ్రాముల తలంబ్రాలు
భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు, అంతరాలయ అర్చనను తపాలా శాఖ అధికారులు భక్తులకు అందజేయనున్నారు. ఇందులో 10 గ్రాముల తలంబ్రాలు, 2 ముత్యాలు, పసుపు, కుంకుమ, మిస్రీ, కాజు అన్నీ కలిపి 80 గ్రాముల వరకు ఉంటాయి. వీటి ధర రూ.450లు ఉంటుంది. రెండవది శ్రీ సీతారామ కల్యాణ తలంబ్రాలు. ఇందులో రాములోరి కల్యాణ తలంబ్రాలు 20 గ్రాములు, 2 ముత్యాలు ఉంటాయి. వీటి ధర రూ.150లుగా నిర్ణయించారు.
మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు
భక్తులు పోస్టాఫీసు యాప్‌లో కానీ పోస్టుమెన్ ద్వారా కానీ స్థానిక తపాలా కార్యాలయంలో సంప్రదించి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఇతర సమాచారం కోసం 1800-266-6868 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్‌చేసి సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ప్రసాద వివరాలను ఫోన్ నెంబర్‌లకు ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
కానుకగా తలంబ్రాల ప్యాకింగ్ మిషన్
ఎపిలోని తిరుపతికి చెందిన సేవా కుటుంబం మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రామయ్య సన్నిధికి రూ.1 లక్ష 70 వేల విలువ గల తలంబ్రాల ప్యాకింగ్ మిషన్‌ను కానుకగా అందించారు. గత కొన్నేళ్లుగా తాము భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు సమర్పిస్తున్నట్లు ఆ మహిళలు తెలిపారు. ఈ ఏడాది 2 క్వింటాళ్ల వడ్లను 5 రాష్ట్రాల్లోని 4 వేల మంది ఆర్య వైశ్య మహిళలతో ఒలిపించి సోమవారం భద్రాద్రి రామయ్య సన్నిధికి అందించారు. ఈ నెల 30వ తేదీన జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఈ తలంబ్రాలను వాడనున్నారు.