ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐలో రెండో అత్యున్నత అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐఎస్‌ఐలో బ్రిగేడియర్ హోదాలో పనిచేస్తున్న ముస్తఫా కమాల్ బార్కీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్ ఎన్‌కౌంటర్ దక్షిణ వజీరిస్థాన్ లోని అంగూర్ అడ్డలో చోటు చేసుకున్నట్టు పాక్ పత్రిక డాన్ తెలిపింది.
ఈ ఎన్‌కౌంటర్‌ను ముస్తఫా లీడ్ చేస్తుండగా తూటాలు తగిలినట్టు వెల్లడించింది.న ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముస్తఫా కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌కు నాయకత్వం వహిస్తున్నట్టు పాక్ పేర్కొంది. ముస్తఫా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారి కాదు. ఆయన ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉగ్రవాదులకు లీకైంది.
దీంతో వారు ఆయన్ను చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. తెహీక్ ఇ తాలిబన్లపై పాకిస్థాన్ చేస్తున్న పోరాటంలో ఇదో పెద్ద ఎదురు దెబ్బ. ముస్తఫా మృతికి పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ , పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. పాక్‌లో పోలీసులు, రక్షణ దళాలను లక్షంగా చేసుకొని ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల పెషావర్ లోని మసీద్‌లో బాంబు పేలుడులో దాదాపు 100 మంది పోలీసులు మృతి చెందారు.