హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌పై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఫైర్ అయ్యారు. బండి సంజయ్(Bandi Sanjay) కు మతి భ్రమించిందని ధ్వజమెత్తారు. వడగళ్ళవాన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్(CM KCR) స్వయంగా బాధిత రైతులను పరామర్శించారని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ప్రజలు, రైతుల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి పరిహారం అందించాల్సింది పోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పరిహారం కోసం కేంద్రాన్ని అడగబోమని ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. విపత్తు సమయంలో ఆదుకోవాల్సిన కేంద్రం చేతులెత్తేసిందన్నారు. ఆదుకుంటామన్నా రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్ళగక్కుతున్నారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ ఆదరణ లభిస్తుందో అన్న ఆందోళనలో పడ్డారు. బిజెపి నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. ప్రతి చిన్న విషయాన్ని బిజెపి రాజకీయం చేయాలని చూస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే రైతుల కష్టాలు తొలగిపోయాయన్నారు. చేతికందిన పంట కోల్పోవడం బాధాకరమన్నారు. రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. విపక్షాల మాటలు విని మోస పోవద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.