Saturday, December 21, 2024

కవిత పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ తేదీల్లో మార్పు జరిగింది. కవిత పిటిషన్ పై 27న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. తొలుత ఈ పిటిషన్ విచారణ 24న జరుగుతుందని షెడ్యూల్ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలువురి కీలక నేతలను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను కూడా ఇడి ప్రశ్నించింది. ఈ సందర్భంగానే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇడి తనకు పంపిన సమన్లు రద్దు చేయాలని, తనకు వ్యతిరేకంగా అరెస్టు వంటి చర్యలేవీ తీసుకోవద్దని, అలాగే మహిళైన తనను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను 24న చీఫ్ జస్టిస్ సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తుందని పిటిషనర్‌కు తెలిపింది. కానీ, తాజాగా, ఈ తేదీలో మార్పు జరిగింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ క్లారిటీ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం కవిత పిటిషన్‌ను ఈ నెల 27న విచారించనుంది.

కవిత పిటిషన్ ఐటెం 36గా లిస్ట్ అయింది. ఇడి సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ వాదన వినేంత వరకు కవిత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని ఇడి సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News