Sunday, November 24, 2024

నీరవ్ మోడీ, లలిత్ మోడీలను వెనకేసుకొస్తున్న బిజెపి: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఓబీసీ కులాలవారిని రాహుల్ గాంధీ దొంగలతో పోల్చారంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శుక్రవారం గట్టిగా తిప్పికొట్టింది. ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొటి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీలను వెనకేసుకొస్తూ కుల రాజకీయాలకు బిజెపి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
మోడీ ఇంటిపేరుపై దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో బిజెపి అధ్యక్షుడు నడ్డా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓబీసీలను దొంగలతో పోల్చి రాహుల్ గాంధీ తన కులతత్వాన్ని చాటుకున్నారని నడ్డా ఆరోపించారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండించారు. జెపిసి నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ప్రభుత్వ ధనంతో నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయారని, ఓబీసీలు ఆ పనిచేయకపోతే ఇక వారిని అవమానించడం ఎక్కడుందని ఖర్గే ప్రశ్నించారు. మీ ఆప్త మిత్రుడి కారణంగా ఎస్‌బిఐ, ఎల్‌ఐసి నష్టాల పాలయ్యాయని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మొదుగా చోరీ చేయడంలో సాయం అందించి ఆ తర్వాత కుల రాజకీయాలు చేస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఖర్గే ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్లు పోస్టు చేశారు.

అనంతరం..ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ధనంతో ఎవరు పారిపోయారో చెప్పాలని తమ పార్టీ సమాధానాలు కోరుతోందని అన్నారు. బిజెపి మాత్రం అసలు అంశం నుంచి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వెనుకబడిన తరగతులకు అవమానం జరిగినట్లు బిజెపి గగ్గోలు పెడుతోందని, కాని బిసిలు, ఎస్‌సి, ఎస్‌టిలు, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉందని ఖర్గే సష్టం చేశారు. మనువాదాన్ని నమ్మే వీరంతా బిసిల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా నడ్డా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నడ్డా వాస్తవాలను వక్రీకరిస్తూ పరువునష్టం రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీలను నడ్డా వెనకేసుకొస్తున్నారని, నడ్డా వ్యాఖ్యలతో అసలు నిజం ఏమిటో బయట పడిందని, నడ్డా నిజాయితీకి ధన్యవాదాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదానీపై కూడా మీ నిజాయితీ నిరూపించుకోండంటూ ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News