Saturday, November 23, 2024

అటవీ విస్తీర్ణంలో మేటి తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఇండియాలో 7,13,789 ఘనపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉండగా (8,09,537 ఘ.కి.మీల ఫారెస్ట్/ ట్రీ కవర్), దేశ భూభాగంలో 21.71% అడవులు (24.62 శాతం ఫారెస్ట్/ ట్రీ కవర్) ఆక్రమించి ఉన్నాయని ‘ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా- 2023’ వెల్లడిస్తున్నది. దేశంలోనే అటవీ సంపద వివరాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి 1987లో తొలిసారి ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’ విడుదల చేయడం జరిగింది. ‘ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా-2023’ వివరాల ప్రకారం 70 శాతం (3.04 శాతం) దట్టమైన అడవులు, 40-70 శాతం మధ్యస్థ అటవీ సాంద్రత (9.33శాతం), 1040 శాతం ఓపెన్ అడవులు (9.34 శాతం), స్క్రబ్ ఫారెస్టులు (1.42 శాతం), ఇతర అడవులు (76.87 శాతం) విస్తరించి ఉన్నాయని తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా అటవీ ప్రాంత విస్తీర్ణం పెరిగినప్పటికీ కొండచరియలు విరిగిపడడం, తీవ్ర వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో ఈశాన్య రాష్ట్రాలలోని సహజ అటవీ సంపద తరుగుతున్నదని, దీనితో జీవవైవిధ్యం విచ్ఛిన్నమై మానవ మనుగడ ప్రమాదంలో పడనుందని హెచ్చరిస్తున్నది.

అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన రాష్టాల జాబితాలో 77,493 ఘ.కి.మీలతో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో, 66,431 ఘ.కి.మీలతో అరుణాచల్ ద్వితీయ స్థానంలో, 55,717 ఘ.కి.మీలతో చత్తీస్‌గఢ్, 52,156 ఘ.కి.మీలతో ఒడిశా, 50,798 ఘ.కి.మీలతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండడం గమనించారు. ఆంధ్రప్రదేశ్‌లో 29,784 ఘ.కి.మీలు, తెలంగాణలో 21,214 ఘ. కి.మీల అటవీ సంపద ఉన్నది.

అధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్ (90%), మిజోరామ్ (85%), అండమాన్ నికోబార్ దీవులు (82%), అరుణాచల్ ప్రదేశ్ (79%), మేఘాలయా (76%) జాబితాలో ముందు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18.28 శాతం, తెలంగాణలో 18.93 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నది. కనిష్ట అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు/యూటీల జాబితాలో లడక్ (1.35%), హరియానా (3.63% ), పంజాబ్ (3.67%), రాజస్థాన్ (4.87%), యుపి (6.15%), గుజరాత్ (7.62%), బీహార్ (7.84%) ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని పర్వత/ కొండ ప్రాంతాల జిల్లాలలో 902 చ.కి.మీ అటవీ విస్తీర్ణం తగ్గడం జరిగింది. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు 1,020 చ.కి.మీ అటవీ ప్రాంతాన్ని కోల్పోయాయి.

2019- 2021 మధ్య పెరిగిన అటవీ విస్తారం నమోదు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ (647 ఘ .కి.మీ పెరుగుదల), తెలంగాణ (632 ఘ.కి.మీల పెరుగుదల), ఒడిశా (537 ఘ.కి.మీ పెరుగుదల), తరువాత స్థానాల్లో కర్నాటక, జార్ఖండ్‌లు ముందు వరుసలో ఉండడం తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తున్నది. 2019 వివరాలతో పోల్చితే దేశంలో 2,261 చదరపు కిమీ అటవీ సంపద పెరిగిందని, ఇందులో 1,540 చదరపు కిమీ అటవీ విస్తీర్ణం, 721 చదరపు కిమీ ట్రీ కవర్ పెరిగినట్లు తేలుతున్నది. ఈశాన్య రాష్ట్రాల అటవీ సంపద పరిరక్షణకు కమ్యూనిటీ యాజమాన్యం, గిరిజన భూముల రక్షణ లాంటి అంశాలు సవాళ్ళుగా నిలుస్తున్నాయి. దేశంలోని 17 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 33 శాతానికి పైగా పెరగడం హర్షదాయకం. వీటిలో ఐదు రాష్ట్రాలు / యుటిల్లో 75 శాతం కన్న అధికంగా, 12 రాష్ట్రాలు /యుటిల్లో 33 నుంచి 75% అటవీ ప్రాంతాలు ఉన్నాయి.

దేశంలోని అటవీ విస్తీర్ణం, ట్రీ కవర్, మామిడి తోటలు, హరిత క్షేత్రాలు, కార్బన్ స్టాక్, కార్చిచ్చులు, వన్యప్రాణి రిజర్వ్ ఫారెస్టులు లాంటి పలు అంశాలకు సంబంధించిన వివరాలను ఐయస్‌యఫ్‌ఆర్ నివేదిక వివరిస్తుంది. దేశంలో 4,992 చ.కి.మీ మామిడి తోటలు ఉండగా, 2019 తరువాత 17 శాతం విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తున్నది. మామిడి తోటల విస్తీర్ణం ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పెరగడం గమనించారు. దేశ అటవీ ప్రాంతాలలో 22.27% అడవులు కార్చిచ్చులకు అవకాశాలను కలిగి ఉన్నాయి. ఇండియాలో 1.5 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో వెదురువనాలు ఉండగా, 2019 తరువాత 10,594 చ.కి.మీతగ్గడం గమనించారు.

నగరాల్లో పెరిగిన గ్రీన్ కవర్
హైదరాబాదు, ఢిల్లీ నగరాలలో ఫారెస్ట్ కవర్ పెరగగా, అహ్మదాబాదు, బెంగళూరులలో తగ్గడం జరిగింది. అటవీ విస్తీర్ణంతో జీవవైవిధ్యం, నీటి నిల్వలు/ వనరులు, వర్షపాతం, ఔషధ వనరులు, వన్యప్రాణుల సంపద, భూసారాన్ని పెంచడం, నేల కోతను తగ్గించడం లాంటి పలు ప్రయోజనాలు కలిగి ఉంటాయి. దేశంలోని పులులు, సింహాల రిజర్వ్ ఫారెస్టుల వివరాలను కూడా ఐయస్‌యఫ్‌ఆర్ -2021 నివేదిక వివరించే ప్రయత్నం చేసింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, బిట్స్- గోవా సంస్థలు సంయుక్తంగా ‘మ్యాపింగ్ ఆఫ్ క్లైమెట్ ఛేంజ్ హాట్ స్పాట్స్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ అంశంలో డిజిటన్ అధ్యయనం చేస్తున్నాయి.

అడవుల పరిరక్షణ -జీవవైవిధ్య సంరక్షణ
పర్యావరణ సమతుల్యానికి దేశంలో కనీసం 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని నిపుణులు అంచనా వేసినా దేశంలో 24.62 శాతం మాత్రమే ఉండడం వాతావరణ ప్రతికూల మార్పులకు కారణమవుతున్నది. స్థానిక సమాజం (పోడు సాగు సమస్య), వ్యాపార ధోరిణి పెరుగుతున్న ఫలితంగా అటవీ విస్తీర్ణం క్రమంగా తరుగుతోంది. అటవీ ప్రాంతాలను సాగుకు వాడే ప్రయత్నాల్లో భాగంగా అడవులను నరికి వేయడం, అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ సిబ్బందిపై దౌర్జన్యాలు చేయడం, ప్రాణాలు కూడా తీయడం చూస్తున్నాం. 2030 నాటికి భారతంలోని 45- 64 శాతం అడవులు వాతావరణ మార్పులకు, భూతాపానికి గురికానున్నట్లు అంచనా వేస్తున్నారు. అడవులను కాపాడడం, ప్రతి ఏట అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, అభయారణ్యాలను కాపాడడం, ఆవాసాల్లో హరిత కవర్‌ను పెంచడం, అడవుల నరికివేతను నిర్దయగా అడ్డుకోవడం లాంటి పలు చర్యలు భవిష్యత్తులో మానవ ఉనికికి ఊపిరి పోస్తాయని గమనించాలి.

భూమాత ఒంటిపై హరిత వస్త్రాలను కప్పి, కాలుష్య కోరల్ని నిర్దయగా పీకేసి, చెట్లే భవితకు మెట్లని, హరితమే ఆరోగ్య ప్రదాయిని అన్ని నమ్ముదాం, వృక్ష సంపదను కాపాడుకుందాం. ఫార్ట్ అండ్ హెల్త్ నినాదంతో భూమాతకు ఊపిరితిత్తులైన అడవుల హరిత దుప్పట్లను కప్పేందుకు కృషిచేద్దాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News