Sunday, December 22, 2024

కళాక్షేత్రలో లైంగిక వేధింపులు: దర్యాప్తునకు తమిళనాడు డిజిపి ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కళాక్షేత్ర ఫౌండేషన్‌కు చెందిన రుక్మిణీ దేవి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్(ఆర్‌డిసిఎఫ్‌ఎ) సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేయవలసిందిగా చెన్నై నగర పోలీసు కమిషనర్ శంకర్ జీవల్‌ను తమిళనాడు డిజిపి శైలేంద్ర బాబు ఆదేశించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సిడబ్లు) ఆదేశించిన దరిమిలా డిజిపి ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.

నిందితుడిని కాపాడుతున్న ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌పై కూడా కేసు నమోదు చేయాలని ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్ రేఖా శర్మ డిజిపి శైలేంద్రబాబును కోరారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో అరెస్టు చేయాలని, ఫిర్యాదులు అందచేయడానికి ముందుకువస్తున్న బాధితులందరికీ అవసరమైన సహాయం అందచేయాలని ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్ ట్వీట్ చేశారు. పోలీసుల నుంచి సవివర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోరినట్లు కమిషన్ తెలిపింది. నివేదిక సంతృప్తికరంగా ఉంటే విచారణకు ఆదేశిస్తామని కమిషన్ పేర్కొంది.

కాగా.. డిజిపిని గురువారం కలిసిన రేవతి లైంగిక వేధింపుల ఆరోపణలపై తమ సంస్థకు చెదిన అంతర్గత కమిటీ చేసిన విచారణకు చెందిన నివేదికను సమర్పించారు. ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజంలేదని ఈ నివేదికలో పేర్కొనడంతో నిందితుడిని కాపాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్‌డిసిఎఫ్‌ఎకు చెందిన ఫ్యాకల్టీ సభ్యుడు ఒకరు తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుతమ అనుభవాలను వివరిస్తూ పలువురు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ పేర్లు వెల్లడించకుండా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ఒత్త వదంతులుగా వర్ణించిన కళాక్షేత్ర సంస్థను అప్రతిష్టపాల్జేయడానికి ఇవి ఉద్దేశించవని పేర్కొంది. ఈ అంశంపై మాట్లాడరాదని తమ సంస్థ విద్యార్థులకు ఫౌండేషన్ ఆంక్షలు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News