హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఖర్గే హైదరాబాద్ ఎయిర్‌పోర్‌టలో గంట సేపు ఆగారు. ఖర్గేతో పాటు కర్ణాట పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ కూడా ఉన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎఐసిసి రాష్ట్ర ఇంచార్జి మానిక్ రావ్ ఠాక్రే, ఇతర ముఖ్య నాయకులు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎఐసిసి కార్యదర్శి నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, మధు యాష్కి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, హర్కర్ వేణుగోపాల్, అనిల్ యాదవ్ తదితరులు ఖర్గేకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఖర్గే గంట సేపు సమావేశమయ్యారు. హాత్ సే హాత్ జోడో యాత్ర, పాదయాత్ర గురించి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 31 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసినట్లు ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం బాగా జరుగుతోందని, ప్రజా స్పందన బాగుందని రేవంత్ రెడ్డి వివరించారు. పాదయాత్ర క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన అంశాలపై ఖర్గే మాట్లాడారు. బిజెపి నియంత పాలన, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రాజకీయాలపై క్షేత్ర స్థాయిలో పోరాటం మరింత ఉధృతం చేయాలని ఖర్గే చెప్పారు. మోడి, బిజెపి చేస్తున్న అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలు ఖర్గేకు రేవంత్ వివరించారు.