Monday, November 25, 2024

పునఃపరిశీలించాల్సిన చట్టం

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీకి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష వేసిన నేపథ్యంలో పరువు నష్టం చట్టం అవసరంపై చర్చించవలసిన అగత్యం ఏర్పడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శ అన్ని అవధులను దాటిపోయి సాగిపోతున్న పరిస్థితుల్లో ప్రజలకు పాలకులు జవాబుదారీగా వుండేలా చేయడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు చేసే రాజకీయ విమర్శలను పరువు నష్టం నిబంధనల పరిధిలోకి లాగి శిక్షలు విధించడం సబబేనా, బ్రిటిష్ వారు తమ సొంత ప్రయోజనాల కోసం తెచ్చిన పరువు నష్టం చట్టాన్ని ఇంకా కొనసాగించాలా అనే అర్థవంతమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత రాజ్యాంగం 19 అధికరణ ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుల్లో చేర్చి ప్రజాస్వామ్యానికి అది ప్రాణప్రదమైనదిగా ప్రకటించింది.

అదే సమయంలో పరువు ప్రతిష్ఠలను 21వ అధికరణ ద్వారా జీవన స్వేచ్ఛలో భాగం చేయడం వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛపై ముఖ్యంగా మీడియా స్వేచ్ఛపై కత్తిని వేలాడదీసినట్టు అయింది. రాజ్యాంగం 19వ అధికరణ భావ ప్రకటనా స్వేచ్ఛను పలు రూపాల్లో కల్పిస్తున్నది. శాంతియుతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోడం, సంఘాలు, యూనియన్లు నెలకొల్పుకోడం, భారత దేశమంతటా స్వేచ్ఛగా సంచరించడం, దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరపడడం, కోరుకొన్న వృత్తిని అవలంబించడం ఈ రూపాల్లో భావ ప్రకటన స్వేచ్ఛను అనుభవించే అవకాశాన్ని 19వ అధికరణ భారత పౌరులకు కల్పించింది. అదే సమయంలో 19 అధికరణలోని 2వ నిబంధన శాంతి భద్రతలను కాపాడడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలను విధించే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. పరువు నష్టం చట్టానికి ప్రధానంగా 19(2) అధికరణే ఆధారంగా వుంది.

అయితే అనేక అపమార్గాల్లో ప్రజాస్వామ్యానికి ముప్పు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఒక్కటే దానిని కాపాడగల సాధనంగా ఉపయోగపడుతున్నది. నిరంకుశ ధోరణులను నిలదీసి అడగడానికి తోడ్పడుతున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల స్వేచ్ఛలకు అపాయం తలెత్తుతున్న నేపథ్యంలో భావ ప్రకటనకు ఎటువంటి అడ్డంకీలేని స్వాతంత్య్రం అవసరం పెరిగింది. గౌతమ్ అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం బయటపడిన తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటులో ప్రతిపక్షం పట్టుపట్టడం, అదానీకి, ప్రధాని మోడీకి గల సాన్నిహిత్యాన్ని రాహుల్ గాంధీ పార్లమెంటులోనే బయటపెట్టడం జరిగాయి. ఈ పరిస్థితి దేశ ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరింత జవాబుదారీగా వుండవలసిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. ఈ సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తే తమ పరువు మరింతగా గంగలో కలుస్తుందని ప్రధాని మోడీ, బిజెపి భావించినట్టు రూఢి అవుతున్నది. నాలుగేళ్ళ నాటి రాహుల్ గాంధీ ప్రసంగంపై దాఖలైన పరువు నష్టం కేసులో తీర్పు సరిగ్గా ఇప్పుడే వెలువడడం దానిని ఆసరా చేసుకొని రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం యాదృచ్ఛికంగా సంభవించిన పరిణామాలుగా భావించలేము. ఈ నేపథ్యంలో పరువు నష్టం చట్టంపై పునః పరిశీలన అవసరం కలుగుతున్నది. మన దేశంలో పరువు నష్టం చట్టం రెండు రకాల శిక్షను నిర్దేశిస్తున్నది.

మొదటిది సివిల్ నేరంగా పరిగణించి జరిమానా విధించడానికి అవకాశమిస్తున్నది. రెండవది క్రిమినల్ నేరంగా చూసి గరిష్ఠంగా రెండేళ్ళ జైలు శిక్షను విధించడానికి అవకాశం కల్పిస్తున్నది. అధికారంలో వున్న వారు ఈ రెండవ మార్గంలో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడరు. రాహుల్ గాంధీ విషయంలో అదే జరిగింది. గతంలో బోఫోర్స్ కేసులో ఉక్కిరిబిక్కిరైన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పరువు నష్టం చట్టాన్ని కఠినతరం చేయడానికి, మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి తీసుకు వచ్చిన బిల్లును దేశంలోని మీడియా సంఘటితంగా ఎదిరించి వెనక్కు తీసుకొనేలా చేసింది.

2016లో న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, పిసి పంత్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 కింద పరువు నష్టానికి విధించే శిక్ష సమంజసమైనదేనని, సమాజం వ్యక్తుల సమూహమని, వ్యక్తులకు కలిగే హాని సమాజం మొత్తానికి కూడా వర్తిస్తుందని అందుచేత పరువు నష్టాన్ని నేరంగా పరిగణించడం సబబేనని అభిప్రాయపడింది. అయితే రాజకీయాలు కలుషితమైపోయి రాజ్యాంగ విధి విధానాలను అతిక్రమించి, దాని నిర్దేశానికి విరుద్ధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతూ సెక్యులర్ సదాశయానికి కూడా హాని కలిగిస్తున్నందున మీడియాకు, ప్రతిపక్షానికి వీలైనంత సహేతుక స్వేచ్ఛను కలిగించడానికి పరువు నష్టం చట్టాన్ని తొలగించడమో, సవరించడమో జరిగి తీరాలి. కనీసం క్రిమినల్ పరువు నష్టం అనే దానిని చట్టం నుంచి తొలగించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News