Saturday, December 21, 2024

ప్రేమ జీవితం

- Advertisement -
- Advertisement -

భార్య భర్త ఇద్దరూ చూడముచ్చటగా వున్నారు. ఆయనకి డెబ్భై, ఆవిడకి అరవై అయిదు వయసుండవచ్చు అనుకున్నా డు రవికాంత్. వాళ్ళలాగే, వీళ్ళు అద్దెకు దిగటానికి చూసిన వాళ్ళింటి పోర్షన్ కూడా నీట్‌గా, సౌకర్యం గా వుంది. ‘అద్దె ఎంతండి?’ అనడిగాడు రవికాంత్. ‘ఎంతో కొంత ఇద్దురు గాని, ఇల్లునచ్చిందా?’ అన్నాడాయన. ‘నచ్చిందండీ. కానీ అద్దె ఎంతో, నావల్ల అవుతుందో లేదో చూ సుకోవాలిగా?’ ‘మీరు ఇప్పుడున్న ఇంటికి ఎంతిస్తున్నా రో, అంతే ఇవ్వండి. లేకపోతే కొంచెం తగ్గించి ఇవ్వండి” ఆయన మాటలకి ఆశ్చర్యపోయాడు రవికాంత్. ఇప్పుడు వుంటున్న ఇంటి కన్నా ఇది పెద్దది. పైగా తన ఆఫీసుకి చాలా దగ్గర. ఆయన డిమాండ్ చేస్తే వెయ్యో, రెండు వేలో ఎక్కువకైనా సిద్ధమే.

అలాంటిది ఇలా అంటుంటే ఆశ్చర్యం కాక మరేమిటి?
“రండి లోపల కూచుని మాట్లాడుకుందాం” అని రవికాంత్ దంపతుల్ని వాళ్ళింట్లోకి తీసికెళ్ళాడాయన. లోపలికెళ్ళి కూచున్నారు. కాస్సేపటికి వంట మనిషి కాఫీలు, ఫలహారం తెచ్చి పెట్టింది. ఇంటి ఆ భాగం ఇంకా బాగా పెద్దది. “చూశారుగా, ఇంత పెద్ద ఇంట్లో నేనూ, మా ఆవిడా వంటావిడా, అలా అని ఒంటరితనంతో ఏం బాధపడిపోటం లేదు. వీలున్నంత వరకూ దేనికీ పెద్దగా బాధపడకుండా వుండటం ప్రాక్టీసు చేస్తున్నాం” అన్నాడాయన నవ్వుతూ.
రవికాంత్‌కి బదులు ఏం చెప్పాలో తోచలేదు. “నా పేరు బదరీనాథరావు. ఎక్కువ మంది భద్రం అని పిలుస్తుంటారు. మా ఆవిడ సుగుణ. నేను రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ని. ఈవిడా బ్యాంకులోనే పని చేసి రిటైర్ అయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు, నలుగురు మనవలు. వాళ్ళంతా విదేశాల్లోనే వున్నారు. అదీ మా హిస్టరీ” “నా పేరు రవికాంత్. ఎల్.ఐ.సిలో ఉద్యోగం, మా ఆవిడ వనజా. హౌస్ వైఫ్. మాకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. వాళ్ళ సంసారాలు బెంగళూరులో. ఇక్కడ మేమిద్దరమే” అన్నాడు బదులుగా రవికాంత్.

“నాకు అద్దె పట్టింపు లేదు. ఎందుకంటే ఆర్థికంగా బావున్నాం. పక్క నుండే వాళ్ళు ప్లెజంట్‌గా వుండాలి. అదీ ముఖ్యం. మీ దంపతుల్ని చూడగానే సాత్వికంగా, చక్కగా కనిపించారు” అన్నారు భద్రం మళ్ళీ నవ్వుతూ. కాఫీలు అయిపోయాక, ఇప్పుడు అక్కడ ఇస్తున్న అద్దె ఇక్కడా ఇస్తానని, ఆదివారం వచ్చి చేరతామని చెప్పాడు రవికాంత్.
తిరిగి వచ్చేస్తుంటే మంచి వసతైన ఇల్లు దొరికినందుకు సంతోష పడ్డారు రవికాంత్ దంపతులు. భద్రంగారు, వాళ్ళ ఆవిడ ఒంటరి ముసలాళ్ళు. తరచుగా తమ పోర్షన్‌లోకి వచ్చి సుత్తి వెయ్యరు కదా! అన్న చిన్న అనుమానం వచ్చింది రవికాంత్‌కి.
అన్నట్టుగానే ఆదివారం వచ్చి చేరిపోయారు రవికాంత్ దంపతులు. సామానంతా సద్దుకునేటప్పటికి వారం పట్టింది. చిత్రమేమిటంటే, ఈ వారంలో ఒక్క సారి కూడా భద్రంగారు కాని, వాళ్ళ ఆవిడ కాని వీళ్ళ పోర్షన్‌లోకి రాలేదు. తాము పిలవలేదన్న పట్టింపు వల్ల రాలేదేమో అన్న అనుమానం వచ్చింది వీళ్ళకి. ఓసారి భద్రంగారు బైట కనపడితే అదే ఆయనతో అన్నాడు రవికాంత్. “ఒక్కసారి కూడా రాలేదు. మేం పిలవలేదనా?” అని భద్రంగారు దానికి నవ్వారు.

“మాకు అలాంటి పట్టింపులు అస్సల్లేవు. పనేదేనా వుంటే తప్పనిసరిగా వచ్చే వాళ్ళం. పనేం లేకపోయింది. అదీ కాక అనవసరంగా ఎవర్నీ డిస్టర్బ్ చేయటం నాకసలు ఇష్టం వుండదు. అలా అని మీరు మా ఇంటికి రాకూడదని ఏం లేదు. ఎప్పుడేనా రండి. వెల్‌కమ్‌” అన్నారు ఎంతో సున్నితంగా తన ఊహ పూర్తిగా తప్పయిందే, వాళ్ళు వచ్చి సుత్తేస్తారేమో అన్న ఆలోచన ఎంత తప్పు అనుకున్నాడు రవికాంత్. అదే కాదు ఆ తర్వాత పరిశీలిస్తే భద్రంగారి పద్ధతులు చాలా ప్రత్యేకం అని అర్థమైంది.తను ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి పనులూ వున్నాయి. పిల్లల తాలూకు బాధ్యతా వుంది. ఇన్ని వుండి తనకీ, భార్య వనజకీ ఒక్కోసారి ఏం తోచక విసుగ్గా వుంటుంది. అలాంటిది భద్రం దంపతులు పిల్లలకీ, మనవలకీ అంత దూరంగా వుంటూ, ఏ విసుగూ బాధా లేకుండా ఎలా గడుపుతున్నారా? అనిపించింది. రవికాంత్, వనజలే రోజూ సాయంత్రం భద్రంగారి ఇంట్లోకి వెడుతున్నారు. అక్కడున్నంత సేపూ సమయం సరదాగా గడుస్తోంది.

కొంచెం చనువు పెరిగాక, ఇంక రవికాంత్ తన సందేహం తీర్చుకోకుండా వుండలేకపోయాడు. “కాలక్షేపం లేదు అనుకోకుండా, ఇంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు?” అని భద్రంగారిని అడిగాడు ఓ రోజు. “నిజం చెప్పనా, నేను మా ఆవిణ్ణి, ఆవిడ నన్ను అస్తమానం ప్రేమించుకుంటూ హాయిగా గడిపేస్తున్నాం” అన్నాడాయన. ఆయన అలా అంటున్నది వేళాకోళంగా నేమో అనుకున్నాడు. కాని కాదు, ఆయన సీరియస్‌గానే అలా చెప్పాడని ఆ తర్వాతి ఆయన మాటల వల్ల అర్థమైంది. “చిన్న స్థాయిలో జీవితం ఆరంభించాము. ఎప్పుడూ ఎవరి సాయం లేదు. సంసార బాధలు పడుతూ, పిల్లల్ని చూసుకుంటూ ఎంత హైరాణ పడాలో అంతా పడ్డాము. అదృష్టమో, దైవానుగ్రహమో ఇప్పుడీ స్థితికి చేరాం. ఇప్పుడూ ఇంకా హైరాణా అసంతృప్తి పెట్టుకుంటే అది జీవితాన్ని నలిపేస్తుంది. ఇప్పుడు నిజంగా మాకేం కావాలి. ఇద్దరం సుఖంగా రోజు గడిపేస్తే చాలదు. మాకే కాదు, ఈ వయసులో అందరు భార్యభర్తల ప్రైయారటీ అదే అవ్వాలి.

నా కంఫర్ట్‌ని ఆవిడ, ఆవిడ కంఫర్ట్‌ని నేనూ చూడగలిగితే చాలదూ. అదే చేస్తున్నాం. హాయిగా గడిపేస్తున్నాం. లేదు అనుకుంటే అన్ని లోట్లే కనిపిస్తాయి. పిల్లలు, మనవలు దూరంగా ఉన్నారు. నిజమే. తప్పదు. మరీ మనసు ఆగకపోతే వెళ్ళి కొన్నాళ్ళు వాళ్ళతో వుంటాము. అక్కడ వాళ్ళ జీవిత విధానం వేరు. దాన్ని మనం అంగీకరించాలి. అలాగే తీసుకోవాలి. అంతే విమర్శించి, తప్పుపట్టి ఉపయోగం లేదు. వాళ్ళు ఇక్కడికి రారని చాలా మంది తప్పుపడతారు. అక్కడి జీవితం కన్నా, మాకు ఇక్కడే బావుంది. అందుకే ఇక్కడుంటున్నాం. మనవాళ్ళు లేరే అనుకుంటే లోటు. ఇక్కడ వున్న జీవితం మనదే అనుకుంటే తృప్తి. నేనూ ఆవిడా రోజూ రెండు పూట్లా బైటికి వెళ్ళి వస్తాం. ప్రశాంతత నిచ్చే దేవాలయాలున్నాయి. ఆదరణ చూపించగలిగితే ఎంతో తృప్తినిచ్చే అనాథ శరణాలున్నాయి. తిండిలేని పేదలకి అన్నదానం చేస్తుంటే ఎంతో హాయి. ఇటువంటి దిన చర్య మా ఇద్దరికీ ఇష్టమే. అదే మా ఇద్దరి పరస్పర ప్రేమ. ఈ వయసులో ఈ ప్రేమంటే ఏ లోటూ వుండదు” అనురాగపు కొత్త రూపం. కొత్త దృక్కోణం. ఆ మాటలు రవికాంత్‌కి, వనజకి కూడా ఎంతో తృప్తిగా వున్నాయి. అయినా రవికాంత్ వదిలేయలేదు.“అయితే మీకు ఏ రకం చిన్న దిగులు ఎప్పుడూ అనిపించదా?” అన్నాడు. “ఎందుకుండదు. దిగులు జీవితంలో ఓ భాగమే కదా. సద్దుబాటు చేసుకొని మనసుని సరిపెట్టుకోటమే” అన్నారు భద్రం గారు. “అంటే?” అనడిగాడు రవికాంత్.

“ఇద్దరం పెద్ద వయసు కొచ్చాంగా. ఎప్పటికేనా.. ఎవరు ముందు, ఎవరు వెనక అన్న ఆలోచనొస్తుంది. అప్పుడు ఒంటరితనం ఎలా అనిపిస్తుంది. అయినా అది మన చేతుల్లో లేనిది. ప్రస్తుతం ఉన్న జీవితం జీవించటమే. జీవితం ఉన్నంత వరకు మమకారంతో ప్రేమగా ఉండటమే” అన్నారు. ‘వయసు బాగా పెరిగాక కీచులాడుకుంటూ, ఒకళ్ళ నొకళ్ళు తప్పులే పట్టుకుంటూ చీదరగా బతికే భార్యాభర్తలెందరో. వాళ్ళలా కాక, ఇలా బతకటం ఎంత విలువైంది’ అనుకున్నారు రవికాంత్ దంపతులు.

వి. రాజారామ మోహన రావు
9394738805

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News