న్యూస్‌డెస్క్: హిందూ దేవతలను అవమానించినందుకు, అశ్లీలతను వ్యాప్తి చేసినందుకు సినీ నటి తాప్సీ పన్నుపై మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరానికి చెందిన హిందూత్వ సంస్థ హింద్ రక్షక్ సంఘటన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినీ నటి తాప్పీపై బిజెపి ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు, హింద్ రక్షక్ సంఘటన్ కన్వీనర్ ఏకలవ్య గౌర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది మార్చి 14న తాప్పీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారని, ఆ వీడియో ఒక ఫ్యాషన్ షోకు చెందినదని, అందులో తాప్సీ అసభ్యకరమైన దుస్తులు ధరించారని గౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరమైన దుస్తులు ధరించడంతోపాటు తన మెడలో లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్‌ను తాప్సీ ధరించారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోలీసులకు అందచేశారు.
ముంబైలో మార్చి 12న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న సినీ నటి తాప్సీ పన్ను మెడలో లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్‌తో అసభ్యకర దుస్తులు ధరించి తమ మత మనోభావాలు గాయపరిచారని ఆరోఫిస్తూ ఏకలవ్య గౌర్ నుంచి ఫిర్యాదు అందినట్లు ఛత్రీపుర పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మంగళవారం తెలిపారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.