మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాల వర్షాలు, వడగండ్లవానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారు. పంటనష్టం, పోడు భూములు, గొ ర్రెల పంపిణీ, గృహలక్ష్మి పథకం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. వడగండ్ల వానలతో పంటనష్టం జరిగిన నేపథ్యంలో ఇటీవల సిఎం కెసిఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులను పరామర్శించిన విష యం తెలిసిందే. పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి రూ.10వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభు త్వ నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ సమావేశం లో సిఎం అధికారులను ఆదేశించారు. ఆయా జి ల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (కియో) సర్వే చేయిం చి, జరిగిన పంట నష్టం వివరాలను పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని కెసిఆర్ ఆదేశించారు.
ఈ మేరకు తక్షణ చర్యలు ప్రారంభించాలని సిఎస్ శాంతికుమారిని, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావును ఆయన ఆదేశించారు. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయాలని సిఎం స్పష్టం చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కా ర్యక్రమాన్ని ప్రారంభించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారా లు సాగాలన్నారు. అలాగే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రకటించిన మే రకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశ గా చర్యలు చేపట్టాలని కెసిఆర్ సూచించారు. ఈ మేరకు విధి,విధానాలను రూపొందించాలని ఆ యన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో అర్హులైనవారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందా అని సిఎం ఆరా తీశారు. 4లక్షల ఎకరాలకు సంబంధించి 1.55 లక్షల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్‌బుక్కులు సిద్ధం చేశామని సిఎంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సిఎం తెలిపారు.
భద్రాద్రి రామయ్య ఆలయానికి రూ.కోటి
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30 న భద్రాచలంలో జరుగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.కోటి నిధులను సిఎం కెసిఆర్ మంజూరు చేశారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా భద్రాచలం దేవస్థానం ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ అభ్యర్థన మేరకు, కల్యాణ వేడుకల నిర్వహణ కోసం రూ.కోటి ప్రత్యేక నిధులను కేటాయించాలని సిఎం నిర్ణయించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను సిఎం ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో సిఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిఎం కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.