Saturday, December 21, 2024

ఇది టీజరే మాత్రమే.. సినిమా ముందుంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశానికీ ఆర్థిక చోదక శక్తి తెలంగాణ అని అయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పైసా ఇవ్వకపోగా కనీసం సహకరించడం లేదని పురపాలక, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదా అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్ మహా నగరంలో జరిగిన అభివృద్ధి కేవలం టీజర్ మాత్రమేనని సినిమా మొత్తం ముందందన్నారు. మంగళవారం ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రేటర్‌లో పరిధిలో మొత్తం 185 చెరువులున్నాయని, ఇందులో ప్రస్తుతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద 50 చెరువులను అభివృద్ధి, సుందరీకరణకు పలు సంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు. అందులో జిహెచ్‌ఎంసికి చెందినవి 26, హెచ్‌ఎండిఏకు చెందినవి 25 చెరువులు ఉన్నాయన్నారు.

మిగిలిన చెరువుల అభివృద్ధి నిర్వహణకు మరిన్ని సంస్థలు ముందుకురావాలని మంత్రి కోరారు. చెరువుల పునరుద్ధ్దరణ, సమగ్రాభివృద్ధ్దిలో భాగంగా ముందుకు వచ్చిన నిర్మాణ రంగ సంస్థలు అన్ని అంతర్జాతీయ నగరాల ప్రమాణాలకు దీటుగా ఈ చెరువులను అభివృద్ది చేయాలని కోరారు. కేవలం చెరువుల సుందరీకరణ, అభివృద్ధి కోసం మాత్రమే ఎంఒయులను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చిన మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్‌ను జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ సంప్రదించవచ్చని సూచించారు. సిఎస్‌ఆర్ పద్దతి ద్వారా చేపట్టే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సేద తీరడానికి కుర్చీల ఏర్పాటు, వ్యాయామశాల, ఆట స్థలం, థీమ్ పార్కు, టాయిలెట్స్, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా శాటిలైట్ మ్యాప్ ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు డిమార్క్ చేస్తున్నామని తెలిపారు.

గడిచిన 8 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరం ప్రగతి పథంలో దూసుకుపోతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వంలో సమర్థవంతమైన పరిపాలన, శాంతిభద్రల పరిరక్షణల కారణంగా అంతర్జాతీయ అనేక సంస్థలు పెటుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఫార్మా సిటీ ద్వారా ఉద్యోగాలతో పాటు ప్రపంచంలోనే పెద్ద ఫార్మాసిటీగా అవతరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని 2023 జూలై నాటికి వంద శాతం మురుగునీరు శుద్ధి చేసేందుకు ఎస్.టి.పిల నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. దుర్గం చెరువును అభివృద్ది చేయడం ద్వారా పర్యాటక ఆకర్షణ ప్రాంతంగానే కాక సినిమా షూటింగ్ లకు నిలయంగా మారిందన్నారు. ఇటీవల ఫాక్స్ ఖాన్ చైర్మన్‌హైదరాబాద్ ను సందర్శించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసినప్పుడు హైదరాబాద్ సిటీ అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చిన విషయం గుర్తు చేశారు.

నగరంలో 250కిలో మీ. మేర మెట్రో విస్తరణ

కేంద్ర ప్రభుత్వ ఎలాంటి సహకారం అందించపోయినాహైదరాబాద్‌లో 250 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. తాజాగా లక్డికాపూల్ నుంచి బి.హెచ్.ఇ.ఎల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణ చేపట్టేందుకు కేంద్రాన్ని కోరగా ఫీజిబులిటీ లేదని నివేదిక ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులను చేపడుతుందన్నారు. అంతేకాకుండా నగరంలో మరింత మెరుగైన ప్రజా రవాణా కోసం 500 ఎలక్ట్రానిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, భవిష్యత్తులో వందశాతం ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైదరాబాద్‌లో రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీ అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్జానంతో ప్రపంచం అబ్బురపడేలా రాచకొండలో ఫిలిం సిటీ, అదేవిధంగా ఒలంపిక్ స్థాయిలో స్పోర్ట్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఆకుల లలిత, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, సిసిపి దేవేందర్ రెడ్డి, సి.ఇ సురేష్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఇంజనీరింగ్ విభాగం అధికారులు, నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News