Sunday, November 24, 2024

రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

- Advertisement -
- Advertisement -

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయం గూర్చి ఓ మాట చెప్పారు. EVERY THING ELSE CAN WAIT, BUT NOT AGRICULTURE అని! కాలాలు మారిపోవచ్చు. కాని, మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైన ఆహారోత్పత్తి ఆగకూడదు. ఆలోచన, బాధ్యత లేని వారే దానికి విఘాతం కలిగిస్తారు. 2021లో కూడా ఇదే చూశాం. భారత ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్లచట్టాల్ని రైతులు తిప్పికొట్టారు. 14 నెలలు పాటు ఉద్యమించిన రైతులు కేంద్ర ప్రభుత్వపు మెడలు వంచగలిగారు. 750 మంది రైతులు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చినా, ఉద్యమ తీవ్రతను తగ్గించుకోలేదు. విధిలేక ప్రభుత్వం నల్ల చట్టాల్ని వెనక్కి తీసుకుంది. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు కూడా వ్యవసాయదారులకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. వారి ఉద్యమాన్ని బలపరిచాడు. ఫలితంగానే తన అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది వైదిక ధర్మకర్తలకు నచ్చలేదు. అందుకే ఘర్షణలు జరిగాయి.

యజ్ఞయాగాల్లో పశువుల్ని ముఖ్యంగా గోవుల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వడం ఒకప్పుడు వేద సాంప్రదాయంలో నిత్యకృత్యంగా వుండేది. ఆ చర్యతో వ్యవసాయం చేసే వారికి పశువుల కొరత ఏర్పడి, వ్యవసాయం కుంటుపడింది. పశువుల మాసం నిలువ వుండదు. కాని, అవే పశువుల్ని యజ్ఞాల పేరిట వధించకుండా, వాటిని వ్యవసాయానికి ఉపయోగిస్తే అనేక రకాల తృణ ధాన్యాలను పండించుకోవచ్చు. ఆ ధాన్యం సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఆకలి తీరుతుంది అని ఆనాటి వ్యవసాయదారులు గ్రహించారు. అందుకే రైతులు తిరగబడ్డారు. యజ్ఞ గుండాల్ని ధ్వంసం చేశారు. వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా సమాజ పరిస్థితులు మారిపోవడం వల్ల వేద రుషులు, బ్రాహ్మణులు నాటి వ్యవసాయదారుల్ని ‘రాక్షసులు’ అని పిలిచి తమ ఉక్రోషం వెళ్ళగక్కుకున్నారు. దేవతలు ఎలాగైతే కల్పితాలో, రాక్షసులు, దయ్యాలు, భూతాలు అన్ని కల్పితాలే కదా? వాస్తవాలు గ్రహిద్దామనుకునే వారికి విషయం బోధపడుతుంది. ఆనాటి యజ్ఞ సంస్కృతికి, పశుబలికి వ్యతిరేకంగా వ్యవసాయదారులు చేసిన తిరుగుబాటు, అహింసా సిద్ధాంతానికి దారి తీసింది.

దాన్నే బుద్ధుడు ఒక తాత్తిక సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. క్రతువుల్ని, పశు బలుల్ని, యజ్ఞ యాగాల్ని తీవ్రంగా నిరసించాడు. అది వ్యవసాయదారులకు బలాన్నిచ్చింది. బుద్ధద్ధమ్మం సమాజం మీద బలంగా ప్రభావం చూపుతున్న కాలం గనుక, రైతు లోకం బుద్ధుడి అహింసా సిద్ధాంతాన్నే కాక, ఇతర అంశాల్ని కూడా తలకెత్తుకుంది. ఎలాగయితేనేం వ్యవసాయం అభివృద్ధి చెందింది.మొత్తానికి మొత్తంగా కాకపోయినా, బుద్ధుని అహింసా సిద్ధాంతం జంతు బలిని ఆపింది. యజ్ఞ సంస్కృతిని అడ్డుకుంది. ఆ పరిణామం సమాజంలో గుణాత్మకమైన మార్పుకు దోహదం చేసింది. మరొక రకంగా వ్యవసాయాభివృద్ధికి, ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు బౌద్ధం కారణమయ్యింది. సమాజంలో అధిక సంఖ్యాకులకు పని దొరికింది. జనం ధాన్యం పండించడం కొనసాగించారు. మాంసాహారం మీద ఆధారపడ్డ సమాజం క్రమక్రమంగా శాకాహారంలోకి మారడం జరిగింది. నైతికతను స్థాపించడంలోనే కాదు, బౌద్ధం ఇతరత్రా మానవ ప్రవృత్తిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. జాలి, కరుణ, మానవత్వం వంటి లక్షణాలకు విలువ పెరిగింది. ఏ కాలంలోనైనా ‘రైతుల్ని బాధించిన వారు ప్రగతి కాముకులు కాదు’ అని తేలింది! ఇది ఇలా వుంటే, మరో వైపు వైదిక ధర్మ ప్రబోధకుల, మనువాదుల పనులు మరోలా వుండేవి.వీరి స్మృతులు మానవీయ విలువలకు పెద్ద విఘాతం కలిగించేవి.

ఇందులో మనువు ఏమన్నాడంటే “ధర్మాన్ని కుల కట్టుబాట్లని దాటిన వారితో మిథ్యాచారులతో, స్వతంత్రంగా ఆలోచించే వారితో అంటే, హేతువాదులతో ఎవరూ మాట్లాడగూడదు” అని. (మనుస్మృతి 430) ఇందులో చెప్పిన ధర్మం కులాలు మనువు ఏర్పరిచినవే. అంటే నిర్దంద్వంగా అతను చెప్పింది చెప్పినట్లుగా ఆచరించాలని ఆదేశించడం. ఇదీ మన స్మృతులు మనకు అందించిన గొప్ప సంస్కృతి. భారతీయ సంస్కృతి అంటే ఇదా? ప్రస్తుతం సంఘ్ పరివార్ వారు తిరగతోడుతున్నది ఈ సంస్కృతినేనా? శ్రమ చేసే వారు ఆలోచించగూడదు. ఆలోచించే వారు శ్రమించగూడదు. అదీ గాక, ఆలోచించే వారితో మాట్లాడగూడదు. ఇదెక్కడి న్యాయం? ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని అంటారే? అదేమైనా జంతువా? నాలుగు పాదాల మీద నడవడానికీ? అక్కడ వారు చెప్పేది నాలుగు పాదాలు కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్గాలు. అవి అలాగే విభజింపబడే వుండాలని మనువాదుల భావన. సంకరం జరగగూడదని వారి భయం. అసలైతే సంకరం జరిగిన తర్వాత ఏర్పడిన ‘మిశ్రమ సంతతి’ లోంచే ఇప్పటి ఈ మానవ జాతి అంతా పుట్టుకొచ్చింది. వాస్తవాలు తెలుసుకోకుండా రాసుకున్న అనాగరిక, అమానవీయ రచన మనుస్మృతి!

బ్రాహ్మణుడు నాగలి తాకగూడదు. కాని, శూద్రులు కష్టపడి పండించింది తీరిగ్గా కూర్చుని భోంచెయ్యొచ్చు. పైగా తమ ఊకదంపుడు ధర్మోపన్యాసాలుగా మార్చి “నిరంతరం చెపుతూ ఉండొచ్చు. ఇదేం పద్ధతి? ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు శారీరక శ్రమను చాలా నీచంగా చూశాయి. శారీరక శ్రమ చేసే వారిని పందులతో, కుక్కలతో సమానం చేశాయి (చాందోగ్యోపనిషత్ 510 8) శారీరక శ్రమ తప్పించుకొని, ఉన్నత స్థానం ఆక్రమించిన వీరు, సమాజాన్ని ముందుకు నడిపే ఆలోచనలేమైనా చేశారా? అంటే అదీ లేదు. ఎంతసేపూ వెనక చూపే కదా? బౌద్ధం హిందూ మతంలో భాగం అని కొందరు వాదిస్తుంటారు. మరి అదే నిజమైతే లక్షల మంది బౌద్ధ భిక్షువుల్ని నరికి నలంద, తక్షశిల లాంటి ఆనాటి బౌద్ధ విశ్వవిద్యాలయాల్ని ధ్వంసం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకప్పటి బౌద్ధా రామాల్ని బలవంతంగా ఆలయాలుగా ఎందుకు మార్చుకున్నారు? హిందూ దేవుళ్ళ అవతారాలలో బుద్ధుణ్ణి ఎందుకు చేర్చుకున్నారు? ఈ దేశాన్నుంచి బుద్ధుడి ఆలోచనా విధానాన్ని పారద్రోలడానికి చేసిన కుట్రలు కాదా ఇవన్నీ?.

తమ బౌద్ధానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చానన్నది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చాలా వివరంగా చెప్పుకున్నారు “నేను ఎందుకు బౌద్ధానికి ప్రాధాన్యత ఇచ్చానంటే.. అది మూడు సిద్ధాంతాల కలయిక! మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణానంతర జీవితం, పునర్జన్మల గురించి చెపుతాయి. బౌద్ధం ప్రజ్ఞ గురించి బోధిస్తుంది. మూఢ నమ్మకాలకు, అతీత శక్తులకు వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది. సమతను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతి వ్యక్తికీ ఇవి అవసరం. బౌద్ధంలోని ఈ మూడు అంశాలు నన్ను ఆకర్షించాయి. ఆ మూడు సిద్ధాంతాలే ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి! భగవంతుడు గాని, ఆత్మ గాని సమాజాన్ని కాపాడలేవు. నా సామాజిక తాత్తికత మూడు మాటల్లో ఇమిడి వుంది. 1. స్వేచ్ఛ 2. సమానత్వం 3. సౌభ్రాతృత్వం” అని అన్నారు అంబేడ్కర్.

చెమటను, కష్టాన్ని దోపిడీ చేసే వారికి వ్యతిరేకంగా మార్క్, ఏంగిల్స్ నిలబడ్డారు. ఒక రకంగా ఆ కాలంలో బౌద్ధం చేసిందే తర్వాతి కాలంలో మార్కిజం చేసింది. అంటే, బౌద్ధానికి దాదాపు ఆధునిక రూపమే మార్కిజం. అంతిమంగా మానవీయ విలువల పరిరక్షణే వీటి ధ్యేయం! అయితే కాలానుగుణంగా మారిన ఆధునిక సమాజపు అవసరాలకు తగినట్టు మార్కిజం రూపుదిద్దుకుంది. ఇంకా ఇంకా అనేక అంశాల్ని చేర్చుకుంటూ అది విశాలం అవుతుందే తప్ప, చాదస్తాలతో కుంచించుకుపోదు. పండు వృక్షాలు నేల వాలక తప్పదు. కొత్త మొలకలదే కదా రాబోయే కాలం? ఏ ఇజమైనా సరే, సైన్సును కలుపుకుంటూ, దాన్ని సమర్థించుకుంటూ పోవాల్సిందే! నిరంతరం సాగే ప్రవాహం లాంటిది విజ్ఞాన శాస్త్రం. అది అన్ని రకాల జీవన విధానాల్ని ఒరుసుకుంటూ, తనదైన వినూత్న శైలిలో ముందుకు సాగుతుంది. నిలువ వున్న నీటి గుంట లాంటివే మతాలు. నిలువ వున్న నీరు ఎప్పుడైనా మురికిగా మారాల్సిందే! జీవన విధానాలైనా, జీవన శైలులైనా, ఆలోచనా విధానాలైనా ప్రవాహాల్లాగా జలజల పారుతున్నప్పుడే అవి కొంత వరకు స్వచ్ఛంగా వుండే అవకాశాలు వుంటాయి.

ఒకసారి బుద్ధుణ్ణి అశ్వలాయనుడు అనే అతను వెతక్కుంటూ వచ్చి వాదనకు దిగాడు. బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి పుట్టారనీ, వారే శ్రేష్టులన్నది ఆయన వాదన! అందుకు బుద్ధుడు ఇలా చెప్పాడు “ఓయీ ! అశ్వలాయనా! బ్రాహ్హణ స్త్రీ రుతుమతి అవుతుంది. గర్భిణి అవుతుంది. శిశువును కంటుంది. శిశువుకు పాలిచ్చి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇతర వర్గాల్లో, ఇతర కులాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏ మాత్రం తేడా లేదు. అయినప్పుడు కొందరు బ్రహ్మ ముఖం నుండి పుట్టడమేమిటి? ప్రకృతి విరుద్ధం కదా?” అని ప్రశ్నించాడు బుద్ధుడు. దానితో కుల వ్యవస్థ దుర్మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు కూడా! స్మృతుల కాలానికి కుల వ్యవస్థ దారుణంగా తయారైంది. నాలుగో వర్గంగా గుర్తింపబడిన శూద్రుల పరిస్థితి చాలా చాలా దిగజారింది. సరే, మనమిప్పుడు ఆధునిక దృక్పథంతో ఆలోచిస్తే అసలు బ్రహ్మ కల్పిత పాత్ర కదా? ఓ కల్పిత పాత్రకు వాస్తవంగా వున్న ఈ మనుషులు పుట్టడమేమిటి? పొసగని వ్యవహారంగా వుంది.

“ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు మీ స్వీయ తప్పిదాలపై దృష్టి సారించండి. మిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతరుల తప్పొప్పుల చిట్టా తెరవకండి” అని అన్నాడు సాక్యముని బుద్ధుడు. నిజమే ఊరికే వారి మనోభావాల్ని దెబ్బ తీసుకోకుండా, తమ తమ పూర్వీకులు చేసిన తప్పిదాలేమిటీ? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఆలోచించుకుంటే బావుంటుంది. అబద్ధమే రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రోజూ మనం నిజాల్ని ప్రచారంలో వుంచుతూ వుండాలి. తప్పుదు “మార్కిజం అర్థమైతే బౌద్ధం బాగా అర్థమవుతుందన్నాడు” రాహుల్ సాంకృత్యాయన్. దీని గూర్చి నేటి యువతరం సీరియస్‌గా ఆలోచించాలి. అంతేకాదు, సైన్సును పక్కన పెట్టే ఇజాలు, రాజకీయ పార్టీలు, నేతలు, మతాలు, మత ప్రచారకులు, మనుషులు.. అన్నింటికీ అన్నీ అందరికందరూ ఇంకా ఇంకా మూఢత్వంలో కొట్టుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. మార్పు కోసం పథకాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఆచరణలో పెడుతూ వుండాలి! మరో వైపు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల్ని నిలదీస్తూనే వుండాలి. ఇటీవల కొనసాగిన రైతు ఉద్యమం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తిని పొందాలి!

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News