Friday, November 15, 2024

ఉప్పల్‌లో క్రికెట్ సందడి..

- Advertisement -
- Advertisement -

 హైదరాబాద్‌లో ఏడు మ్యాచ్‌లు
 ఏప్రిల్ 2న తొలి పోరు
 కనువిందు చేయనున్న ఐపిఎల్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ 2023 సీజన్‌లో భాగంగా ఈసారి హైదరాబాద్‌లో ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కొన్నేళ్లుగా కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరగలేదు. ఈసారి మాత్రం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ రెండున ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్‌హైదరాబాద్‌ల మధ్య పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతోంది.ఆ తర్వాత ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7.30 గంటలకే ఆరంభమవుతోంది.

ఇక ఏప్రిల్ 24న జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు మే నెలలో కూడా హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. మే 4న జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రే జరుగనుంది. అయితే మే 13న జరిగే మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ తలపడుతోంది. ఇక మే 18న జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ ఢీకొంటోంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటల నుంచి జరుగుతుంది. అయితే ఈసారి సొంత గడ్డపై హైదరాబాద్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. గుజరాత్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో హైదరాబాద్ ఉప్పల్‌లో మ్యాచ్‌లు ఆడడం లేదు.

సర్వత్రా ఆసక్తి..
సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగనుండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ఎలాగైనా ఐపిఎల్ మ్యాచ్‌లను చూడాలనే పట్టుదలతో క్రికెట్ అభిమానులు ఉన్నారు. అయితే దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల విషయంలో పలు వివాదాలు చోటు చేసుకోవడం అనవాయితీగా వస్తోంది. ప్రతిసారి టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరుగడం, అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా టికెట్ల అమ్మకం తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాక టికెట్లను కొనుగోలు చేసే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు అభిమానులు గాయాలకు గురికావడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

అయితే ఐపిఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) పాలక మండలి రద్దు కావడంతో ఐపిఎల మ్యాచ్‌ల నిర్వహణ వ్యవహారం సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షిస్తోంది. కాగా, ఐపిఎల్ మ్యాచ్లు మరికొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతుండగా టికెట్ల విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు నిర్వాహకుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. ఐపిఎల్ మ్యాచ్‌లను చూడాలని భావిస్తున్న వారికి ఈ పరిణామం మింగుడు పడడం లేదు. హెచ్‌సిఎ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉండడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి చెందిన మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు కూడా మ్యాచ్‌ల నిర్వహణ ఏర్పాట్లలో జోక్యం చేసుకోవడం లేదు. దీంతో టికెట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అభిమానులకు కష్టంగా మారింది. ఇదిలావుంటే త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని హెచ్‌సిఎకు చెందిన మాజీ ప్రతినిధులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News