Monday, November 25, 2024

నిద్రలేమితో ‘ఫ్యాటీ లివర్’ రిస్కు

- Advertisement -
- Advertisement -

2018లో టోక్యోకు చెందిన టోహో యూనివర్శిటీ గ్యాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు ఎలుకల్లో నిద్రలేమి ప్రయోగాన్ని నిర్వహించారు. సాధారణంగా రోజూ 12 గంటల పాటు ఎలుకలు నిద్రపోతాయి. అయితే ఈ ప్రయోగంలో వాటి నిద్రను ఆరు గంటలకే పరిమితం చేశారు. ఈ విధంగా నిద్రలేమికి గురైన ఎలుకలో కాలేయం కణాలు ఒత్తిడికి గురై కొన్ని జన్యువులు ఇన్సులిన్‌ను ఎదుర్కొనే శక్తిని అధికం చేశాయి. కాలేయంలో కొవ్వు కలిగిన కణాల సంఖ్య పెరిగిపోయింది.

మూడేళ్ల తరువాత చైనా లోని జింజియాంగ్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి నిద్రలేమితో బాధపడేలా ఎలుకలని తయారు చేశారు. దీంతో కాలేయం ఎంజైమ్స్, రక్తం, కాలేయం కొవ్వు విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా నిద్ర పోయే ఎలుకల్లో ఇలాంటి అవలక్షణాలేమీ లేవు. ఈ అనుభవాల బట్టి నిద్రలేమితో ఫ్యాటీ లివర్ వ్యాధి ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే తెలుసుకుందాం. కాలేయంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతే కాలేయ వాపు వస్తుంది.

కాలేయంలో కొవ్వు ఎందుకు పెరుగుతుంది?
కాలేయంలో కొవ్వు మొత్తం కాలేయం బరువులో 5 శాతం మించి ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. చక్కెర పానీయాలు, ఆల్కహాలు, తీసుకుంటే కేలరీలు ఎక్కువౌతాయి. దీనివల్ల అవసరానికి మించి కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. ఈ కాలేయ వ్యాధి ది రెండు రకాలు ఒకటి మద్యపానపు కాలేయ వ్యాధి. అతిగా మద్యం తాగితే వస్తుంది. మద్యపానేతర కాలేయవాపు అంటే కాలేయంలో కొవ్వు నిక్షేపాలు పేరుకుని పోవడం వల్ల వచ్చ నాన్ ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి) అని అంటారు.

ఈ రెండో రకం కాలేయ వ్యాధికి కచ్చితమై కారణాలు తెలియవు. అయితే ఇది ఇన్సులిన్ నిరోధిత , జీవక్రియ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ వ్యాధి మనిషిలో నిగూఢంగా ఉండవచ్చు. లేదా కాలేయం పూర్తిగా వైఫల్యం చెంది తీవ్రమైన లక్షణాలు బయటపడవచ్చు. స్థూలకాయం బరువు తగ్గించడం, వ్యాయామంతో కాలేయాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ఈ వ్యాధికి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడితే శస్త్రచికిత్స తప్పనిసరి.

ఇది నిశ్శబ్ద వ్యాధి . లక్షణాలు ఒకంతట బయటపడవు. కానీ అలసట, పొత్తి కడుపు ఎగువ కుడి భాగంలో అసౌకర్యంగా ఉండటం తదితర లక్షణాలు ఉంటాయి. వాపుతో కూడిన మంట, కాలేయానికి నష్టం సంభవించినప్పుడు వాచిన కాలేయం సంకేతాలను చూపిస్తుంది. ఈ లక్షణాలు సిర్రోసిస్ పరిస్థితికి దారి తీయవచ్చు. సిర్రోసిస్ అంటే కాలేయం కణాల్లో క్షీణత ఏర్పడటం. మచ్చలతో కామెర్లను పోలి ఉంటుంది. చర్మం, కళ్లలోని తెల్లగుడ్డు పసుపు రంగులో మారవచ్చు. కాలేయం దెబ్బతిన్నదనడానికి మరో సంకేతం జలోదరం.

30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ( బిఎంఐ) ఉన్నవాళ్లు దీనివల్ల ప్రమాదంలో పడతారు. శరీరం బరువు పెరిగే కొద్దీ కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోగుల్లో ఆరోగ్యం కీలక పాత్ర వహిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర , ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. కొవ్వు లేని ఆహార పదార్ధాలే తీసుకోవాలి. ఎంత చిన్నపాటి వ్యాయామం చేసినా మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి అవసరమైన పాలు కూడా ఫ్యాటీలివర్ రోగులు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాలు జీర్ణం కావడం ఆలస్యమౌతుంది కాబట్టి పాలు వీరికి పనికి రావని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News