నూగూరు,వెంకటాపురం/ములుగు : మండల పరిధిలోని ఉప్పేడు గొల్లగూడెం గ్రామంలో మిర్చితోటల్లోకి కూలీ పనులకు వెళ్లిన 25 మంది కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఉప్పేడు, గొల్లగూడెం గ్రామాలకు చెందిన 25 మంది కూలీలు గ్రామ సమీపంలోని మిర్చితోటలో కూలీ పనులకు వెళ్లారని తెలిపారు.
కాగా మధ్యాహ్న సమయంలో కూలీలు భోజనం చేసిన అనంతరం మిర్చితోటలో మొక్కలకు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన డ్రిప్‌పైపును శుభ్రం చేసేందుకు రైతులు ద్రాకాశాన్ని డ్రిప్‌పైపులోకి వదిలారని తెలిపారు. విషయం తెలియని కూలీలు ఆనీరు తాగి వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన గ్రామస్తులు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. కాగా కూలీల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించినట్లు తెలిపారు.