Saturday, December 21, 2024

బిజెపికి ప్రతిష్ఠాత్మకం కర్నాటక ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

బిజెపి నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమలం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక దశలో బస్వరాజ్ బొమ్మైను మారుస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎంను మారిస్తే ప్రజల దృష్టిలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని హస్తిన పెద్దలు ఆలోచించినట్లు సమాచారం. దీంతో బస్వరాజ్ బొమ్మైను కదపలేదు. మరో వైపు కన్నడ రాజకీయాల్లో లింగాయత్ వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా కీలకంగా మారారు. చాలా కాలంగా వీరంతా బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే కొంత కాలం కిందట నిర్వహించిన ఒక సమావేశంలో లింగాయత్ మఠాధిపతులంతా బస్వరాజ్ బొమ్మై సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామం కమలనాథులకు మింగుడు పడటం లేదు.

కర్నాటక ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే పదో తేదీని పోలింగ్‌కు ముహూర్తం పెట్టింది. కర్నాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణాదిన కమలం పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటకనే. కర్నాటకది విచిత్ర పరిస్థితి. దేశ వ్యాప్తంగా బిజెపి హవా కొనసాగుతుంటే కన్నడ నేలపై ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. కర్నాటకలో ఒకవైపు బిజెపి బలహీనపడుతుంటే మరోవైపు కాంగ్రెస్ బలపడుతోన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు మూడేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిజెపిపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. కన్నడ నేలపై కొంత కాలంగా బిజెపికి వ్యతిరేకత పెరుగుతోంది. బిఎస్ యడ్యూరప్ప హయాం నుంచి కమలం పార్టీపై వ్యతిరేకత చాపకింద నీరులా ఉంది. ఈ విషయాన్ని హస్తిన పెద్దలు గ్రహించి వెంటనే అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పను నొప్పించకుండా కుర్చీ నుంచి దించేశారు. ఆయనకు విధేయుడైన బస్వరాజ్ బొమ్మైకు సిఎం పదవి కట్టబెట్టింది బిజెపి అగ్రనాయకత్వం. అయితే బస్వరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి అయినా కూడా క్షేత్ర స్థాయి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.

హంగల్ ఉప ఎన్నికలో బిజెపి ఓటమి

2021 నవంబరులో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పక్షమైన బిజెపిపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. మొత్తం రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో బిజెపి సిట్టింగ్ సీటు అయిన హంగల్ ఉప ఎన్నికలో బిజెపి ఓటమి పాలయింది. హంగల్ నియోజక వర్గం ముఖ్యమంత్రి బస్వరాజ్ సొంత జిల్లా హవేరీ పరిధిలోకి వస్తుంది. అంతేకాదు సిఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న షిగోన్ సెగ్మెంట్‌కు పొరుగునే ఉంటుంది. బిజెపికి గట్ట్టి మద్దతుదారులుగా పేరున్నలింగాయత్ సామాజికవర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఉప ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని రాజకీయ పండితులు భావించారు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా బిజెపి పరాజయం పాలైంది. హంగల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 7,373 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మనే బిజెపి అభ్యర్థి శివరాజ్ సజ్జనార్‌పై విజయం సాధించారు.

బిజెపి నేతలపై అవినీతి ఆరోపణలు

బిజెపి నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమలం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక దశలో బస్వరాజ్ బొమ్మైను మారుస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎంను మారిస్తే ప్రజల దృష్టిలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని హస్తిన పెద్దలు ఆలోచించినట్లు సమాచారం. దీంతో బస్వరాజ్ బొమ్మైను కదపలేదు. మరో వైపు కన్నడ రాజకీయాల్లో లింగాయత్ వర్గానికి చెందిన మఠాధిపతులు కూడా కీలకంగా మారారు. చాలా కాలంగా వీరంతా బిజెపికి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. అయితే కొంత కాలం కిందట నిర్వహించిన ఒక సమావేశంలో లింగాయత్ మఠాధిపతులంతా బస్వరాజ్ బొమ్మై సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామం కమలనాథులకు మింగుడు పడటం లేదు. నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న గ్రానైట్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి గుడ్ బై కొట్టడం బిజెపికి మరో మైనస్ పాయింట్‌గా భావించాల్సిందే. గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది వేరే విషయం. అయితే రాయ్‌చూర్, బళ్లారి, కొప్పల్ తదితర ప్రాంతాల్లో గాలి జనార్ధ్దన్ రెడ్డికి ఉన్న పలుకుబడిని ఎవరూ కాదనలేరు. గెలవడం సంగతి పక్కన పెడితే, గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా అయితే గాలి జనార్ధ్దన్ రెడ్డికి ఉందనేది వాస్తవం.

ఎగువ భద్ర పూర్తయితే రాయలసీమ ఎడారే!

ఇటీవలి కాలంలో కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా పర్యటించారు. కన్నడ నేలపై అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు.కర్నాటక సమస్యలపై హస్తిన పెద్దలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. కర్నాటకలో బిజెపి ప్రయోజనాల కోసం రాయలసీమ రైతుల జీవితాలను పణంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కర్నాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లు కేటాయించడమే దీనికి నిదర్శనం. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారుతాయని హెచ్చరించారు నీటిపారుదల రంగ నిపుణులు. ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రాయలసీమ రైతులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర అభ్యంత్రాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అభ్యంతరాలను పట్టించుకునే స్థితిలో లేదు కేంద్ర ప్రభుత్వం. తుంగభద్ర జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను గాలి కొదిలేసింది. కర్నాటక రైతులను ఆకట్టుకోవడానికి రాయలసీమ అన్నదాతలను నట్టేట ముంచడానికి కూడా సిద్ధం అయింది బిజెపి. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధికోసమేననే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఖర్గేకు ప్రతిష్ఠాత్మకమైన కన్నడ అసెంబ్లీ ఎన్నికలు

బిజెపికే కాదు ఒక విధంగా కాంగ్రెస్‌కు కూడా కర్నాటక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమే అని చెప్పుకోవాలి. ఎఐసిసి అధ్యక్షుడుగా ఉన్న మల్లికార్జున ఖర్గే కన్నడ నేలకు చెందిన సీనియర్ నాయకుడు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై పడింది. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం అటూఇటూ అయినా జాతీయ రాజకీయాల్లో ఆయన ఇమేజ్ దెబ్బతినడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. బిజెపి వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విజయం సాధించిందనే చెప్పవచ్చు. తాజా పరిణామాలను పరిశీలిస్తే రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు దేశ రాజకీయాల్లో దుమారం రేపింది. కాంగ్రెస్‌తో సంబంధం లేని సామాన్య ప్రజలు, మేధావుల్లో రాహుల్‌పై సానుభూతి పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోడీ ఇంటి పేరు గలవారి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కోర్టులో దావా వేస్తారా? కోర్టు తీర్పు వచ్చిన తరువాత ఆగమేఘాల మీద లోక్‌సభ సెక్రటేరియట్ స్పందించాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మొత్తానికి బిజెపితో అమీతుమీ తేల్చుకోవడానికి కన్నడ కాంగ్రెస్ రెడీ అవుతోంది.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News