భువనేశ్వర్: ఇద్దరు అటవీ శాఖ సిబ్బంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సంఘటన ఒడిశా బౌధ్ జిల్లాలో జరిగింది. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నిళాచల్ ప్రధాన్, నవ కుమార్ సాహూ అనే అటవీ సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపి పారిపోయారు. నిళాచల్ భుజంపై బుల్లెట్ గాయాలు కాగా, నవకు బుల్లెట్ వెన్నుపూసలోకి చొచ్చుకెళ్లింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నవ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై బౌధ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి దెబప్రియా కంపా స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారని తెలిపాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని కంపా తెలిపారు.