రాయచూర్: కర్నాటకలోని రాయచూర్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినికి అసభ్యకరమ మెసేజ్‌లు పంపడంతోపాటు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఒక స్కూలు ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాయచూర్ పట్టణంలోని శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
త్వరలో రిటైర్ కానున్న ఆ ప్రిన్సిపాల్ తన స్కూలులోనే చదువుతున్న ఒక విద్యార్థిని ఫోన్ నంబర్ సంపాదించి ఆ బాలికకు అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు పోలీసులు చెప్పారు. ఆమె ఫోన్‌కు అసభ్యెకర మెసేజ్‌లతోపాటు అశ్లీల వీడియోలను ఫార్వార్డ్ చేసినట్లు వారు తెలిపారు. ఆమె ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడినట్లు వారు చెప్పారు. తనను సర్ అని సంబోధించవద్దని, మ్రిత్రుడిగా పరిగణించాలని ప్రిన్సిపాల్ తనను కోరినట్లు ఆ బాలిక పోలీసులకు తెలియచేసింది. తన ఇంట్లో తనతో గడపాలంటూ ఆ బాలికకు ప్రిన్సిపాల్ పెద్దసంఖ్యలో మెసేజ్‌లు పంపినట్లు వారు చెప్పారు.
ఆమెను డార్లింగ్ అంటూ అతను పిలిచేవాడని, తనకు సహకరించకపోతే టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడని వారు తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపుల గురించి ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు అతడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.