అగర్తలా: త్రిపురలో బిజెపి శాసన సభ్యుడు జదబ్ లాల్ దేబ్‌నాథ్ అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయాడు. దానిపై స్పష్టీకరణ కోరుతూ పార్టీ ఆయనకు నోటీసు జారీచేయగలదని త్రిపుర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రజీబ్ భట్టాచార్య ఓ వార్తా సంస్థకు తెలిపారు.
త్రిపుర శాసనసభ కొత్తగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు రోజులే (మార్చి 24,27,28) సమావేశమైంది. ప్రతిపక్ష నాయకుడు అనిమేశ్ దేబ్బర్మ బిజెపి ఎంఎల్‌ఏను విమర్శిస్తూ, శాసన సభ్యులంతా తమ చర్యలకు తామే బాధ్యులు కావాలన్నారు. ముఖ్యంగా వారు యువతరానికి తప్పుడు సంకేతాలు పంపొద్దన్నారు. ఆ ఎంఎల్‌ఏపై తగు చర్యలు తీసుకోవాలని దేబ్బర్మ డిమాండ్ చేశారు. కాగా సిపిఐ(ఎం), కాంగ్రెస్ కూడా దేబ్‌నాథ్‌పై విమర్శలు చేశాయి.
‘అసెంబ్లీలో ఫోన్‌లు వాడడం నిషిద్ధం. సభా కార్యక్రమాలపైనే మనం దృష్టి పెట్టాలి. దీనికి బదులు దేబ్‌నాథ్ సభా మర్యాదను ఉల్లంఘిస్తూ అశ్లీల వీడియోలు చూశారు’ అని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ బిరాజిత్ సిన్హా అన్నారు. బిజెపికి ఏ మాత్రం నీతి అనేది ఉన్నా ఆ ఎంఎల్‌ఏపై చర్యతీసుకోవాలన్నారు.
ఉత్తర త్రిపుర బాగ్‌బస్సా నుంచి మొదటిసారి ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికల్లో జదబ్ లాల్ దేబ్‌నాథ్ ఎన్నికయ్యారు. 55 ఏళ్లు ఉన్న ఆయన త్రిపుర బిజెపి యూనిట్‌కు కార్యదర్శి కూడా.