Friday, December 20, 2024

కేంద్రంపై ఆశల్లేవ్!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాజకీయపరమైన దురుద్దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నందున దానిపై ఎలాంటి ఆ శలు పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. న్యాయంగా, ధర్మంగా, చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిపడ్డ నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రం 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకొన్న లక్షాల మేరకు నిధుల సమీకరణకు కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించదని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాల నుంచి నిధులను సమీకరించుకోవడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నట్లు తెలిసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నూతన ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన రోజులని, రానున్న తొమ్మిది నెలల్లో నెలకు కనీసం రూ.19 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందుకు తగినట్లుగా నిధులను సమీకరించుకునే కార్యక్రమాలపై దృష్టిసారించామని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

కేంద్రం ఎలాగూ సహకరించదనే భావనతోనే పంట నష్టం నివేదికలను కూడా పంపేదిలేదని, రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే తన రైతాంగాన్ని ఆదుకొంటానని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో నిధుల సమీకరణకు తాము ఎలాంటి ప్ర యత్నాలు చేసినా కేంద్రం, ఆర్‌బిఐలు అడ్డుపుల్ల లు వేస్తాయని, అందుకే అదనపు నిధుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగానే 2023-24వ ఆర్థిక సంవత్సరంలో రూ.46,317 కోట్ల రుణాల సేకరణకు మాత్రమే అనుమతి ఉందని, అంత వరకే రుణాలు తెచ్చుకొని అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నెలకు సగటున రూ.12 వేల కోట్లు ద్వారా ఆదాయం వస్తుందని, దానికితోడు నెలకు సగటున రూ.3వేల కోట్లను సెక్యూరిటీ బాండ్ల వేలం రూపంలో నిధులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని, ఈ రెండు రంగాల్లో నెలకు రూ.15 వేల కోట్లు సమకూరుతాయి.

అయితే ఈ నిధులు సరిపోవని, నెలకు సగటున రూ.4 వేల కోట్ల లోటు ఉంటుందని, ఈ లోటును భర్తీ చేసుకొని నెలకు రూ.19 వేల కోట్లను ఖర్చు చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, దళితబంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు రానున్న 9నెలల్లో ఏ నెలకు విడుదల చేయాల్సిన నిధులను అదే నెలలో విడుదల చేసేందుకు వీలుగా ఆర్ధికశాఖ, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాలన, జీతభత్యాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ నిధులను ఖర్చు చేయడంలో ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా సకాలంలో నిధులను విడుదల చేయడానికి ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపొందించుకోవాలని, ప్రభుత్వానికి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ అధికారులు వివరించారు.

అందుకే రానున్న ఏప్రిల్ నెలలో అన్ని ఆదాయ సముపార్జన డిపార్ట్‌మెంట్‌లతో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి సమావేశం కూడా జరగబోతోందని, ఈ సమావేశంలో తీసుకునే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమర్పించి ఆమోదం తీసుకొని తమ ప్రణాళికలను అమలుచేస్తామని ఆ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉందా.. అనే అంశాలను పక్కనబెట్టి సొంత ఆదాయ సముపార్జనపైనే దృష్టిసారించా మని, లేకుంటే 2023-24వ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టుకొన్న బడ్జెట్ నిధులను ఖర్చు చేయడం సాధ్యంకాదని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటుందనే అంశాన్ని పక్కనబెట్టి, కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాదనే విషయాన్ని గమనంలో ఉంచుకొని బడ్జెట్‌లో పేర్కొన్న శాఖల వారీగా, సంక్షేమ పథకాల వారీగా నిధులను ఖర్చు చేయడమే తమ ముందున్న ప్రధాన లక్షమని ఆ అధికారులు వివరించారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్ధిక శాఖామంత్రి టి.హరీష్‌రావు 2023-24వ సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను కలిపి మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఖజానాకు రాబడి మాత్రం రూ.2,89,772 కోట్ల 65 లక్షలు ఉంటుందని అంచనా వేశారని, ఆ మేరకు నిధులను రాబట్టుకోవాలంటే కేంద్రంపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందేనని వివరించారు. అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసే ప్రణాళికా వ్యయం కింద రూ.37,524 కోట్ల 70 లక్షలు కేటాయించారని, ఆ కేటాయింపులకు కూడా నిధులను సమకూర్చే పనిలోపడ్డామని వివరించారు. రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీని (ఆర్థిక కార్యకలాపాలు) పెంపొందించడం కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం కోసం సోషల్ సర్వీస్ రంగాలకు రికార్డుస్థాయిలో రూ.1,02,280 కోట్ల 53 లక్షల నిధులను కేటాయించారని, అదే విధంగా ఎకనమిక్ సర్వీసెస్ రంగాల్లో రూ.58,787 కోట్ల 82 లక్షల నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. అందుకే రానున్న 2023-24వ ఆర్థిక సంవత్సరాన్ని తాము ఛాలెంజ్‌గా తీసుకొన్నామని ఆ అధికారులు వివరించారు.

రుణాల సేకరణతో రూ.46,317 కోట్ల 68 లక్షల నిధులను రాబట్టుకోవడానికి కేంద్రం ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా ఉంటే చాలన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం జిఎస్‌డిపిలో తెలంగాణ రాష్ట్ర అప్పులు కేవలం 23.8 శాతం ఉన్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణపై రాజకీయపరమైన కారణాలతో ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు రుణాల సేకరణకు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే అదనపు నిధుల సేకరణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆ అధికారులు వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.3,57,059 కోట్ల వరకూ ఉన్నాయని వార్షిక బడ్జెట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రుణాల సేకరణ పరిమితి 20 శాతానికి మించకూడదని, కానీ తెలంగాణ రాష్ట్ర అప్పులు 23.8 శాతం ఉన్నాయని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని 3.8 శాతం దాటినందున ఈ ఒక్క కుంటిసాకును చూపించి కేంద్రం రుణాల సేకరణకు గండికొడుతుందేమోనని ఆ అధికారులు అనుమానాలను వ్యక్తంచేస్తున్నారు.

2022-23వ ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ.30వేల కోట్లకు కేంద్రం గండికొట్టిందని, ఆ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో కేంద్రంపై ఎలాంటి ఆశలు, నమ్మకాలు పెట్టుకోకుండానే ఆర్థికపరమైన లక్షాలను సాధించుకోవాలని నిర్ణయించినట్లుగా వివరించారు. అందుకే కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకుండా కేంద్రం విధించిన సీలింగ్ వరకే పరిమితమై రుణ ప్రణాళికను రూపొందించుకొన్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News