న్యూఢిల్లీ : తెలంగాణరాష్ట్రం అభివృద్ధిలో ఫస్ట్, అవినీతిలో లాస్ట్‌లో ఉండడం వల్లనే రాష్ట్ర ప్రజలు కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్ ప్రస్తుతం బిఆర్‌ఎస్) ప్రభుత్వానికి రెండోసారి అఖండ మెజారిటీ అందించి గెలిపించారని వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సిఎస్‌డిఎస్)తో కలిసి లోక్‌నీతి పత్రిక నిర్వహించిన సర్వేల గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ సర్వే ప్రకారం ఇటీవలి కాలంలో 13 రాష్ట్రాలకు అ సెంబ్లీ ఎన్నికలు జరగ్గా వీటిలో 12 రాష్ట్రాల్లో గత ఎన్నికలతో పోలిస్తే అవినీతి పెరిగిపోయిందని ఎక్కువ మంది ఓటర్లు భావించారు. అవినీతి పెరగలేద ని భావించే వారితో పోలిస్తే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఈ 12 రా ష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో అధికార పార్టీ లే దా కూటమి తిరిగి అధికారంలోకి రాగా, మిగతా ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయి. వీటి లో రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్‌లు బిజెపి అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్‌లు కావడం గమనార్హం. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా నిలిచింది.
ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు రాష్ట్రంలో గణనీయమైన అభివృ ద్ధి జరిగిందని, అవినీతి బాగా తగ్గింద ని భావించిన కారణంగా అధికార తె లంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్ ప్ర స్తుత బిఆర్‌ఎస్) 2018లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజ యం సాధించి తిరిగి అధికారం చేపట్టగలిగింది. అధికారంలోకి వచ్చిన తొలి అయిదేళ్ల సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రెవిన్యూ తదితర శాఖల్లో తీసుకువచ్చిన సంస్కరణలు, వ్యవసాయ రంగంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఆసరా, వృద్ధాప్య, వికలాంగ పింఛన్ల మొత్తాన్ని గణనీయంగా పెంచడంతో పాటుగా ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేయడంతో మధ్య దళారుల పాత్ర తగ్గిపోయి అవినీతికి తావు లేకుండా పోయింది.
అలాగే రైతు బంధు పథకం కారణంగా చిన్న, సన్నకారు రైతులకు సకాలంలో పంటలు వేయడానికి అవసరమైన ఆర్థిక సాయం లభించడం, వారు పండించిన పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడంవల్ల గిట్టుబాటు ధర లభించడంతో రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న రైతులు ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారు. అలాగే భూముల రిజిస్టేషన్లకు సంబంధించి ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకు రావడంతో క్షేత్రస్థాయిలో రెవిన్యూ శాఖలో అవినీతికి అవకాశం లేకుండా లేకుండా పోయింది. కాళేశ్వరం జలాలతో వందలాది చెరువులను నింపడం, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగు నీటి సదుపాయం కల్పించడం వంటివి కెసిఆర్ ప్రభుత్వం పట్ల ఓటర్ల సానుకూలతకు దోహదం చేశాయి.
ఆగ్రహం ఉన్నా ప్రభావం అంతంతే
ఆయా రాష్ట్ట్రాల్లో సర్వేల్లో పాలు పంచుకున్న వారిలో అధిక శాతం మంది అవినీతి పెరిగిపోయిందని భావించారు. దీని ప్రభావం వారి ఓటింగ్ తీరుపైనా ప్రభావం చూపించింది.అయితే ఆ ప్రభావం అధికార పార్టీని గద్దె దింపేంత తీవ్రంగా లేకపోవడం గమనార్హం. ఉదాహరణకు గుజరాత్, కర్నాటకలలో అత్యధిక శాతం ఓటర్లు అవినీతి పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లోను అధికార పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. చివరికి అవినీతి పెరిగిపోయిందని అంగీకరించిన వారిలో కూడా అధిక శాతం మంది ప్రధాన ప్రతిపక్ష పార్టీకంటే అధికారపార్టీకే ఏటు వేయడం విశేషం. గోవా, బీహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే ఈ వర్గం వారిలో అధికార పార్టీకన్నాప్రధాన ప్రతిపక్ష పార్టీకి కొద్దిగా ఎక్కువ మద్దతు లభించింది. మరో అయిదు రాష్ట్రాల్లో అవినితీ పెరిగిపోయిందని భావించిన ఓటర్లు గంపగుత్తగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో తుది ఫలితాలు అందుకు అనుగుణంగానే వచ్చాయి.
ఎందుకు ప్రభావం చూపలేదు?
అవినీతిపట్ల ఓటర్లలో ఉన్న అభిప్రాయం ఎన్నికల ఫలితాల స్వరూపాన్ని ఎందుకు మార్చలేకపోయాయంటే వారిదృష్టిలో అది ప్రధాన అంశం కాకపోవడమే కారణం. సర్వేల్లో పాలుపంచుకున్న వారిలో అత్యధిక శాతం మంది అవినీతికన్నా మిగతా అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. లోక్‌నీతి సిఎస్‌డిఎస్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేల్లో రెస్పాండెంట్లను ప్రధానంగా ఏ అంశం ఆధారంగా మీరు ఓటు వేస్తారని ప్రశ్నించడం జరిగింది. ఎన్నికలు జరిగిన 12 రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఓటర్లు అవినీతి పెరిగిందని అంగీకరించినప్పటికీ అభివృద్ధిని వారు అత్యధిక ప్రాధాన్యతా అంశంగా ఎంచుకోవడం గమనార్హం. ఇక మిగతా నాలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం ప్రధాన అంశగా నిలిచింది. దాదాపుగా ఈ అన్ని రాష్ట్రాల్లోను ద్రవ్యోల్బణం, అంటే ధరలు పెరుగుదల రెండో ప్రాధాన్యతా అంశంగా నిలవడం విశేషం. కేవలం నాలుగు రాష్ట్రాలురాజస్థాన్. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మాత్రమే అవినీతి టాప్5 అంశాల్లో ఒకటిగా ఓటర్లు పేర్కొడం గమనార్హం. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు రెండింటిలోను 5 శాతం మంది ఓటర్లు అవినీతినిఅత్యంత ప్రధాన సమస్యగా పేర్కొనడం జరిగింది. అలాగే చత్తీస్‌గఢ్‌లో 6 శాతం, జార్ఖండ్‌లో 7 శాతం మంది ఓటర్లు అవినీతిని అత్యంత ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోవడం తెలిసిందే.