వాషింగ్టన్ : అమెరికాలోని హెచ్ 1 బి వీసాదార్లు ప్రత్యేకించి భారతీయ యువ టెక్కీలు సెలబ్రేట్ చేసుకునే పరిణామం ఏర్పడింది. అమెరికాలో హెచ్ 1 బి వీసాదార్ల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చునని అమెరికా జిల్లా జడ్జి తన్యా చుత్కాన్ తీర్పు వెలువరించారు. హెచ్ 1 బి వీసాతో ఉన్నట్లు అయితే భార్యాభర్తలిరువురూ వారి అర్హతలకు తగ్గట్లుగా దొరికే ఉద్యోగాలు చేసుకోవచ్చునని ఈ న్యాయమూర్తి స్పష్టం చేశారు. అమెరికాలో అమెరికన్లే ఫస్ట్ నినాదంతో ఏర్పడ్డ సేవ్ జాబ్స్ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆ మహిళా న్యాయమూర్తి కొట్టివేశారు. ఒబామా దేశాధ్యక్షులుగా ఉన్న దశ లో యువ ప్రతిభ, మానవతా ఇతర ప్రాతిపదికలపై దేశంలో ఉండే కొన్ని నిర్థిష్ట కేటగిరీల హెచ్ 1 బి వీసాదార్ల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించారు.
ఈ మేరకు హెచ్ 1 బి వీసాదార్లకు వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు అవసరం అయిన ఎంప్లాయిమెంట్ అథరైజేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ ప్రక్రియతో విదేశాల నుంచి ప్రత్యేకించి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లిన హెచ్ 1 బి వీసాదార్లు అయిన వేలాది మంది యు వ టెక్కీల బతుకులు కుటుంబపరంగా భద్రమయ్యాయి. వారు సుస్థిరతను సాధించుకుంటూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో ట్రంప్ హయాం దశలో ఇటువంటి వాటి తో స్థానిక అమెరికన్లకు నష్టం జరుగుతుందనే వాదన వచ్చింది. సేవ్ జాబ్స్ సంస్థ కోర్టుకు వెళ్లింది. అమెరికాలో భారత్, చైనాలకు చెందిన వారే అత్యధికంగా హెచ్ 1 బి వీసాలపై పనిచేస్తున్నారు. సేవ్‌జాబ్స్ పిటిషన్‌ను పలు టెక్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటివి వ్యతిరేకించాయి. తమ తీర్పులో జడ్జి చుత్కాన్ పలు విషయాలను ప్రస్తావించారు. విదేశీ జాతీయులు ప్రత్యేకించి హెచ్ 4 వీసాలపై ఉన్న వారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే అనుమతిని ఇక్కడి హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి అమెరికా చట్టసభ కల్పించలేదని సేవ్ జాబ్స్ సంస్థ తెలిపిన విషయాన్ని ఈ న్యాయమూర్తి ప్రస్తావించారు.
అమెరికా చట్టసభలు పూర్తి స్థాయిలో విషయాన్ని పరిశీలించుకునే తెలిసితెలిసే హెచ్ 4 పొంది ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో నివసించేందుకు ఉద్యోగాలు చేసుకోవచ్చుననే అంశాన్ని నిర్థిష్టంగా పొందుపర్చారని ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పులో తెలిపారు. టెక్ కంపెనీల్లోని ఇప్పటి రిట్రెచ్‌మెంట్లు, ఉద్యోగాలకు ఎసరు వేళలో ఇప్పుడు వెలువడ్డ తీర్పు వేలాది కుటుంబాలకు ఉపశమనాన్ని ఇచ్చిందని ఇతర దేశాల నుంచి హెచ్ 1, హెచ్ 4లపై ఉన్న వారి తరఫు న్యాయవాది భుటోరియా తెలిపారు. అయితే స్థానికులకు జరిగే అన్యాయం కొనసాగేందుకు వీల్లేదని, తాము ఉన్నత న్యాయస్థానానికి వెళ్లుతామని యుఎస్ సేవ్ జాబ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.