న్యూస్‌డెస్క్: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక ఆలయంలోని మెట్లబావి కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 35కు పెరిగింది. గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్న ట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గురువారం ఇండోర్‌లోని పటేల్ నగర్‌లో ఉన్న పురాతన బేలేశ్వర్ మహాదేవ్ జూలేలాల్ ఆలయంలోని మెట్లబావిపైన నిర్మించిన స్లాబ్ కూలిపోవడంతో దానిపైన నిలుచున్న పలువురు భక్తులు బావిలో పడిపోయారు.
20 అడుగుల వెడల్పు, 20×20 అడుగుల సైజులో చతురస్రాకారంలో ఉండే అ బావిపైన సిమెంట్ స్లాబ్‌ను దశాబ్దాల క్రితం నిర్మించారు. దీని పైన భక్తులు నిలబడి ఉన్న సమయంలో అది కూలిపోయింది. బావి నీటిలో ఉంచి ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీయగా మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఇళయరాజా తెలిపారు. బావిలో బురదపేరుకుపోవడంతో మృతదేహాల వెలికితీత ఆలస్యమైనట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన 16 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు.