హైదరాబాద్: దేశంలో 14 మంది ప్రధాన మంత్రులు మారినా ప్రజల తలరాత మాత్రం మారలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు రైతు నేతలు తెలంగాణ భవన్ సిఎం కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, వారు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదన్నారు.
13 నెలల పాటు దేశ రాజధానిలో రైతులు పోరాడి విజయం సాధించారన్నారు. రైతుల పోరాటంతో ప్రధాని మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పారన్నారు. దాదాపు 750 మంది రైతులు చనిపోతే ప్రధాని కనీసం స్పందించలేదని మండిపడ్డారు.భారతదేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఎం అన్నారు. తన 50 ఏండ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నానన్నారు. తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండని రైతు నేతలకు సూచించారు. చిత్తశుద్ధితో పని చేస్తే బిఆర్ఎస్ గెలిచి తీరుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.