Saturday, January 11, 2025

మరో ప్రాణాంతక వైరస్ “మార్‌బర్గ్ ”

- Advertisement -
- Advertisement -

గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి మనల్ని వెంటాడుతుండగా, మరో ప్రాణాంక వైరస్ ఆఫ్రికాలో బయటపడింది. దీన్ని మార్‌బర్గ్ వైరస్‌గా గుర్తించారు. ఈ వైరస్ కారణంగా గత ఫిబ్రవరిలో కీ ఎంటమ్ ప్రావిన్స్‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకిన వారిలో 88 శాతం మంది మృతి చెందే ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మార్‌బర్గ్ వైరస్,ఎబోలా వైరస్ ఈ రెండూ ఫిలోవిరిడే కుటుంబానికి చెందినవి. వైద్యపరంగా ఈ రెండు ఒకేరకమైన వ్యాధులే. 1967 లో ఈవైరస్‌ను గుర్తించారు. జర్మనీ లోని మార్బర్గ్, ఫ్రాంక్‌ఫర్డ్, సెర్బియాలోని బెల్గ్రేడ్‌లో ఈ వైరస్ ఒకేసారి గతంలో వ్యాపించింది.అంగోలా , డీఆర్ కాంగో, గినియా, కెన్యా తదితర ఆఫ్రికా దేశాల్లోనూ ఇది వ్యాపించింది. ఈక్వెటోరియల్ గినియాలో దీన్ని గుర్తించడం ఇదే మొదటిసారి. గబ్బిలాల నుంచి మనుషులకు ఇది వ్యాపిస్తుంది.

వైరస్ సోకిన వ్యక్తి స్రవాలు, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నా ప్రమాదం తప్పదు. ఈ వైరస్ సోకిన రెండు నుంచి 21రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర జ్వరం, తలనొప్పి, అలసట వంటి లక్షణాలతో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవుతారు. ఒంటినొప్పులు, కండరాల నొప్పులు, అతిసారం, కడుపు నొప్పి, వికారం, వాంతులు తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అతిసారం ఎక్కువ కాలం కొనసాగ వచ్చు. ఈ దశలో రోగి వికృతంగా మారవచ్చు. కళ్లు లోతుకు వెళ్తాయి. ముఖంపై ఎలాంటి భావాలు ఉండవు. విపరీతమైన నీరసం ఉంటుంది. వ్యాధి ముదిరితే వాంతులు, మలంలోనుంచి రక్తం చిమ్మడం, ముక్కు, చిగుళ్ల నుంచి కూడా రక్తం కారడం జరుగుతుంది.

ఏడు రోజుల్లోనే చాలా మంది బాధితుల్లో రక్తస్రావం కనిపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ పెరిగే కొద్దీ రోగి నాడీ వ్యవస్థపై విపరీత ప్రభావం చూపుతుంది. తీవ్రమైన రక్తస్రావంతో ఎనిమిది తొమ్మిది రోజుల్లోనే మరణం సంభవిస్తుంది. దీని చికిత్సకు ప్రత్యేకించి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. లక్షణాల బట్టి మందులు ఇస్తారు. రక్తపోటు పెరిగితే రక్తనాళాలు చిట్లి మరణించే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని రక్తపోటు పెరగకుండా నిరోధించే చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో రక్తమార్పిడి చేయవలసి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News