Saturday, November 23, 2024

శంకర్ జెంటిల్‌మేన్ హీరోగా మొదట అనుకున్నది ఎవరినో తెలుసా?

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న శంకర్ తొలి చిత్రం జెంటిల్‌మేన్‌లో హీరోగా మొదట అనుకున్నది అర్జున్‌ని కాదన్న విషయం మీకు తెలుసా.. అర్జున్ కన్నా ముందు చాలామంది హీరోల చేతుల్లోకి వెళ్లిన జెంటిల్‌మేన్ కథ చివరకు అర్జున్ దగ్గరకు రావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది.శంకర్ దర్శకత్వం వహించిన చిత్రాలలో 99 శాతం సూపర్ హిట్లే. జెంటిల్‌మేన్, బాయ్స్, జీన్స్, (ఒకే ఒక్కడు, ప్రేమికుడు, శివాజీ, ఇండియన్, 2.0, రోబో, రోబో 2, అపరిచితుడు, ఐ, స్రేహితులు చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్లు కొట్టిన శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ కథనాయకుడిగా ఇండియన్-2 చిత్రంతోపాటు రాంచరణ్ హీరోగా మొదటిసారి తెలుగులో స్ట్రెయిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

రాంచరణ్ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని కూడా ఇటీలే రాంచరణ్ బర్త్‌డే సందర్భంగా అనౌన్స్ కూడా చేశారు.అయితే శంకర్ తన కెరీర్ తొలినాళ్లలో అనుభవించిన స్ట్రగుల్ చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన దర్శకకుడిగా మారడం వెనుక కూడా చాలా పెద్ద కథే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా శంకర్ ఇప్పటి తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి ఎస్‌ఎ. చంద్రశేఖర్ దగ్గర 14  చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. ఒకే దర్శకుడి దగ్గర ఇన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఘనత కూడా ఇండస్ట్రీలో శంకర్‌కే దక్కుతుంది. శంకర్‌లోని ప్రతిభను మొదట గుర్తించింది కూడా ఎస్‌ఎ చంద్రశేఖరే. ఎస్‌ఎసిగా ఇండస్ట్రీలో పిలిచే చంద్రశేఖర్ తెలుగులో కూడా చిరంజీవి హీరోగా చట్టానికి కళ్లు లేవు, శోభన్‌బాబు హీరోగా బలిదానం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అయితే సహాయ దర్శకుడిగా, కో డైరెక్టర్‌గా పూర్తి స్థాయిలో అనుభవం సంపాదించుకుని దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టిన శంకర్ మొదట రాసుకున్నది ఒక ఆఫ్‌బీట్ కథ. హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. కాని కమర్షియల్‌గా ఆ చిత్రం సక్సెస్ కాదన్న మిత్రుల సలహాతో ఆయన జెంటిల్‌మేన్ కథ తయారు చేశారు. దీన్ని నిర్మించే నిర్మాత కోసం ఆయన ఎక్కని ప్రొడక్షన్ కంపెనీలు లేవు. మద్రాసులోని దాదాపు అందరు నిర్మాతలు ఈ కథ విని డబ్బు పెట్టడానికి భయపడ్డారు. దీంతో శంకర్ ముందుగా హీరోలకు కథ చెప్పి ఒప్పిద్దామని, వారికి నచ్చితే నిర్మాతను వారే చూసి పెడతారని అనుకున్నారు. అలా శరత్ కుమార్ వద్దకు ఈ కథ మొదట వెళ్లింది. ఆయన కథ విన్న వెంటనే ఓకే చెప్పేశారు. కాని నిర్మాతను మాత్రం మీరే వెతుక్కోవాలని తేల్చేయడంతో శంకర్ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి.

నిర్మాత కోసం వెదుకుతున్న ప్రయత్నంలో మలయాళ నిర్మాత కుంజుమోన్ తమిళంలో చిత్రం తీస్తున్నారని తెలిసి ఆయన దగ్గరకు వెళ్లి ‘జెంటిల్‌మేన్’ కథ వినిపించారు. నిర్మాత కుంజుమోన్‌కు కథ నచ్చి వెంటనే అడ్వాన్స్ చెక్కు కూడా ఇచ్చేశారు. కథ సుఖాంతమైంది. షూటింగ్ ఇక మొదలు పెట్టవచ్చు అని శంకర్ ఊపిరితీసుకుంటున్న సమయంలో శరత్ కుమార్‌కు డేట్స్ ప్రాబ్లమ్ వచ్చి వేరే హీరోను చూసుకోమని శంకర్‌కు కబురు చేశాడు. ఇక అక్కడి నుంచి మళ్లీ హీరోల వేట మొదలైంది. డాక్టర్ రాజశేఖర్, కార్తీక్‌తో సహా ఇండస్ట్రీలో ఉన్న అప్పటి టాప్ హీరోలు ఎవరికీ జెంటిల్‌మేన్ కథ నచ్చలేదట.. బ్రాహ్మణుడు దోపిడీలు చేయడం అనే కాన్సెప్ట్ వారికి నచ్చలేదు.

చివరకు అప్పుడే రిలీజ్ అయిన అర్జున్ సినిమా చూసి, తన కథకు అర్జున్ సరిపోతాడని శంకర్ భావించారు. వెంటనే ఆయనను కలిసి కథ చెబితే వెంటనే ఒప్పేసుకున్నారు. దీంతో అర్జున్ హీరోగా ‘జెంటిల్‌మేన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఒక్క తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్‌హిట్ చిత్రంగా నిలిచి శంకర్‌తోపాటు అర్జున్‌కు కూడా స్టార్‌డం తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నందుకు చాలామంది హీరోలు ఆ తర్వాత బాధపడ్డారనుకోండి. అది వారి బ్యాడ్‌ లక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News