చెన్నై: ఐపిఎల్ సీజన్16లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) తొలి విజయం నమోదు చేసింది. సోమవారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించిన లక్నో ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేకపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన రుతురాజ్ 31 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కాన్వే ఐదు బౌండరీలు, 2 సిక్స్‌లతో 47 పరుగులు సాధించాడు. శివమ్ దూబే (27), మోయిన్ అలీ (19), రాయుడు 27 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో చెన్నై స్కోరు 217కు చేరింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 22 బంతుల్లోనే 53 పరుగులు చేసి లక్నోకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత సిఎస్‌కె బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.