హింసాగ్ని మీద ఆజ్యం పోసే సమాజం శాంతియుతంగా బతికే అవకాశాలు ఎప్పటికీ వుండవు. హింస అనుకోకుండా సంభవిస్తే దానిని ఆర్పి అది తిరిగి రగలకుండా చూడాలి. అలా కాకుండా ఆ సమాజాన్ని నడిపిస్తున్న శక్తులే దానికి తోడ్పడ్డారనిపిస్తే ఎవరూ చేయగలిగేదేమీ వుండదు. దేశంలో తరచూ మతపరమైన వైషమ్యాలు రగులుతున్నాయంటే అందుకు దేశాన్ని పాలిస్తున్న శక్తులే బాధ్యత వహించాలి. ఈ బాధ్యతను వారు గుర్తించనప్పుడు, తమ రాజకీయ చలి కాచుకోడానికి ఆ అగ్గిని వారే రాజేస్తున్నప్పుడు అది భిన్న వర్గాల ప్రజల మధ్య శాంతియుత సహజీవనాన్ని బలి తీసుకొంటుంది. అక్కడ అభివృద్ధి, శాంతిభద్రతలు శాశ్వతంగా సెలవు తీసుకొంటాయి.
బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో నిన్న, మొన్న చెలరేగిన హింసాకాండ వెనుక ఇటువంటి దురదృష్టకర నేపథ్యం వున్నట్టు కనిపిస్తున్నది. బీహార్‌లోని సాసారం , బీహార్ షరీఫ్ నగరాల్లో శ్రీరామ నవమి సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసాకాండ వరుసగా నాలుగో రోజు ఆదివారం నాడు కూడా కొనసాగినట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఒకరు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం నాడు పాట్నాలో మాట్లాడుతూ చాలా తీవ్రంగా స్పందించారు. దేశంలో శాంతిభద్రతలు కాపాడవలసిన బాధ్యత అమితంగా వున్న హోం మంత్రిగా కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలను సాధించుకోదలచిన నాయకుడుగానే ఆయన మాట్లాడారు. ఈసారి కేంద్రంలో బిజెపి మళ్ళీ రావడం ఖాయమని, బీహార్‌లో కూడా అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ అల్లర్లకు కారణమైన వారిని అప్పుడు తల్లకిందులుగా వేలాడ దీసి ఉరి తీస్తామని అమిత్ షా తీవ్ర సరంతో హెచ్చరించారు.
బీహర్ షరీఫ్, సాసారంలో అల్లరి మూకలు పేట్రేగిపోతున్నా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని నింద మోపారు. నితీశ్ కుమార్ అధికారం కోసం జంగిల్ రాజ్య కర్త లాలూ ప్రసాద్ యాదవ్‌తో పొత్తు పెట్టుకొన్నారని ఎత్తి పొడిచారు. అధికారంలో తామే గనుక వుండి వుంటే పరిస్థితి వేరుగా వుండేదని అన్నారు. ఆ విధంగా అల్లర్లకు ఒకే వర్గం కారణమని ఆ వర్గీయుల పట్ల నితీశ్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదనే ధ్వని అమిత్ షా ప్రసంగంలో స్పష్టంగా వినవచ్చింది. ఆయన ఇలా రాజకీయ హెచ్చరికలతో ప్రసంగించగా, ఆ సమయంలో నితీశ్ కుమార్ ఉన్నత పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
హింసకు దారి తీసిన పరిస్థితులను గురించి తెలుసుకొని లోపాలు ఎక్కడ వున్నాయో వాటిని పూడ్చాలని వారికి సూచించారు. అప్పటికే పోలీసులు వంద మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు. బెంగాల్‌లోని హౌరాలో శ్రీరామ నవమి సందర్భంగా చోటు చేసుకొన్న హింసాకాండ హుగ్లీ జిల్లాకు వ్యాపించింది. హుగ్లీలోని రిష్రా అనే చోట ఆదివారం నాడు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, మరి కొందరు ఆ పార్టీ ఎంఎల్‌ఎలు తీసిన ఊరేగింపు ఒక వర్గం వారి ప్రార్థనా మందిరం ముందు నుంచి వెళ్ళినప్పుడు రాళ దాడి జరిగింది. దానితో అక్కడ హింస చెలరేగింది. ఇందులో కొందరు బిజెపి నాయకులు గాయపడ్డారు. రాళ్ళ దాడి జరిపిన వారిపై పోలీసులు చర్య తీసుకోకుండా జనాన్ని చెదరగొట్టిఊరుకొన్నారని బిజెపి కార్యకర్తలు ఆరోపించారు.
సకాలంలో పోలీసులు పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా దింపారు. అయినా అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గవర్నర్ సివి ఆనంద బోస్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించిన వారిని తీవ్రంగా శిక్షిస్తామన్నారు. నిప్పుతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తూ పరిస్థితిని అదుపు చేయడంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారన్నారు. ఇందుకు ప్రతిగా ఈ పరిస్థితికి బిజెపి కవ్వింపు చర్యలే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
వాస్తవానికి ఒక వర్గం వారి ప్రార్థనా మందిరం సమీపంలో మరో వర్గం వారు మతపరమైన ఊరేగింపు తీయడం శాంతిని తీవ్రంగా హరిస్తుంది. అది తమను రెచ్చగొట్టడం గానే అవతలి వారు భావిస్తారు. హుగ్లీలోని రిష్రా లో బిజెపి ఈ తప్పు చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడే శ్రీరామ నవమి అయిపోయిన తర్వాత మూడు రోజులకు స్వయంగా ఈ ఊరేగింపు తీయడం ఎవరి శ్రేయస్సు కోసమో వారికే తెలియాలి. అల్లరి మూకలను తల్లకిందుగా వేలాడదీసి ఉరి తీస్తామని పాట్నాలో అమిత్ షా హెచ్చరించినప్పుడే పశువుల లారీని తోలుతున్న డ్రైవర్‌ను బెంగళూరు శివార్లలో హత్య చేశారన్న సమాచారం వెల్లడైంది. అందుకు బాధ్యులను కూడా ఉరి తీస్తామని అమిత్ షా హెచ్చరించి వుంటే ఎంతో బాగుండేది.