Friday, November 15, 2024

పెళ్లి కోసం జైలు ఖైదీకి 15 రోజుల పెరోల్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: పెళ్లి చేసుకునేందుకు హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని పెరోల్‌పై విడుదల చేయాలంటూ కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బెంగుళూరులోని పరప్పన అట్రహార కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని అతను పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఇస్తూ పెరోల్‌పై విడుదల చేయాలని అర్థిస్తూ ఖైదీ తల్లి, కాబోయే భార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కర్నాటక హైకోర్టు సోమవారం జైలు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. కర్నాటకలోని కోలార్‌కు చెందిన రత్నమ్మ, జి నీత దాఖలు చేసుకున్న పిటిషన్ ప్రకారం రత్నమ్మ కుమారుడు ఆనంద్, నీత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒక హత్య కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో ఆనంద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.  హైకోర్టుకు అప్పీలు చేసుకోవడంతో యావజ్జీవ శిక్షను 10 ఏళ్ల కారాగార శిక్షగా సవరించడం జరిగింది.

తాను అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, తనకు ఇద్దరు కుమారులు ఉండగా ఇద్దరూ జైలులో శిక్ష అనుభవిస్తున్నారని నాగరత్నమ్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆనంద్, నీత పెళ్లి చేసుకోవాలన్నదే తన చివరి కోరికని ఆమె తెలిపింది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తను ఆనంద్‌ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేనని నీతా ఆ పిటిషన్‌లో పేర్కొంది. మార్చి 25న ఈ పిటిషన్‌ను వారిద్దరూ జైలు అధికారులకు అందచేస్తూ ఆనంద్‌ను 15 రోజులు పెరోల్‌పై విడుదల చేయాలని అర్థించారు. అయితే..జైలు నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకోవడానికి పెరోల్ ఇవ్వడం కుదరదని జైలు అధికారులు స్పష్టం చేశారు. దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే రకమైన కేసులలో రాజస్థాన్ హైకోర్టు, బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరించి ఆనంద్‌ను ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం వరకు 15 రోజులపాటు పెరోల్‌పై విడుదల చేయాలని కర్నాటక హైకోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News