Saturday, November 23, 2024

‘ఎ1’ బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం : పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అని ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం పదవతరగతి ప్రశ్నాపత్రాలను లీకేజీ చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ జడ్‌పి హైస్కూల్‌లో హిందీ ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభమైన తరువాత బయటకు వచ్చిందని తెలిపారు. బూరం ప్రశాంత్ బండి సంజయ్‌తో మాట్లాడిన తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రశ్నాపత్రాన్ని అనేక మందికి ఫార్వార్డ్ చేశాడని, 3వ తేదీ సాయంత్రమే ప్రశాంత్ బండి సంజయ్‌తో చాటింగ్ చేశాడని ఆ సమాచారమే ఎంపి బండి సంజయ్ ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చాడని తెలిపారు. వాట్సాప్ కాల్‌లో ఇరువురు పలుసార్లు మాట్లాడుకున్నారని తెలిపారు.

ఒక ప్రణాళిక ప్రకారమే కమలాపూర్ నుంచి ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్నారని బండి సంజయ్‌తో పాటు ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్, అతని పిఎ, పలువురి బిజెపి నేతలకు ప్రశాంత్ ప్రశ్నాపత్రాలను ఫార్వార్డ్ చేశాడని తెలిపారు. బూరం ప్రశాంత్ గతంలో హెచ్‌ఎం టీవి రిపోర్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం బిజెపికి సంబంధించిన నమో బృందంలో పనిచేస్తున్నాడు. విద్యార్థులను కన్‌ఫ్యూజ్ చేయాలని కుట్ర పన్ని దురుద్దేశంతోనే లీకేజీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని సిపి రంగనాథ్ తెలిపారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ఈ లీకేజీ ప్లాన్ రూపొందించాడు కాబట్టే అతడిని కేసులో ఎ1గా పెట్టామని, ఎ2గా బూరం ప్రశాంత్, ఎ3గా మహేష్, ఎ4 శివగణేష్, ఎ5 మైనర్‌బాలుడిపై కేసులు నమోదు చేసినట్లు, ఇంకా ఎవరెవరు ఈ ఉన్నారనే విషయంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పేపర్ లీకేజీ అంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని పక్కా ప్లాన్ చేశారని సిపి తెలిపారు. విద్యార్థులను కన్‌ప్యూజ్ చేయాలని, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయాలనే కుట్ర ఉందని సిపి తెలిపారు.

పదవతరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తమపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని సిపి తెలిపారు. పక్కా సాక్షాలు సేకరిస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. బండి సంజయ్‌తో చర్చించి ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయాలని కుట్రతోనే ప్లాన్ చేశారు కాబట్టే ఇందులో పాల్గొన్న వారందరిని అరెస్ట్ చేశామని సిపి తెలిపారు. ఎంపి బండి సంజయ్‌ని కరీంనగర్‌లో ముందస్తు అరెస్ట్ చేశారని, కేసు ఇక్కడ నమోదైన తరువాత ఇక్కడకు తీసుకొచ్చామని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. టిఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీస్ యాక్ట్, 1997 ఐపిసి 420, 120బి, 447, 505 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సిపి తెలిపారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

బండి సంజయ్ ఫోన్ ఇవ్వలేదు..

ఈకేసులో వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్స్‌లు విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల సహాయంతో ప్రయత్నిస్తున్నట్లు సిపి తెలిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడం కోసం ఎంపి బండి సంజయ్ మొబైల్ ఫోన్ కోసం ప్రయత్నించగా మొబైల్ పోయిందని చెపుతున్నాడని సిపి తెలిపారు. ఎంపి బండి సంజయ్‌ని సిఆర్‌పిసి సెక్షన్ 41 ప్రకారం అన్ని నిబంధనలు అనుసరించే అరెస్ట్ చేశామని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. వారెంట్ నోటీసు లేకుండా అరెస్ట్ చేయవచ్చని వివరించారు. ఎంపి అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం పంపించామని సిపి రంగనాథ్ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కొత్త సెక్షన్లు పెట్టాల్సి వస్తుందని సిపి తెలిపారు. ఈసమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి ఎంఎ బారి, కాజీపేట ఎసిపి శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఎసిపి జితేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

బండి సంజయ్, ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ రిట్రీవ్ –

100కు పైగా కాల్స్ ఎందుకు మాట్లాడారు?

ఎస్‌ఎస్‌సి హిందీ పేపర్ లీక్ రాజకీయ దుమారం రేపుతోంది. ఇది లీక్ కాదు మాల్ ప్రాక్టీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్దమవుతోంది. మంగళవారం నిందితుడు ప్రశాంత్ తో పాటు హిందీ పేపర్ పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ఫొటోలు తీసి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారంటూ ఘటనతో ప్రమేయమున్న నిందితులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్దరాత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో మార్చుతూ అనేక ప్రాంతాల్లో తిప్పారు. చివరికి వరంగల్ తీసుకెళ్లారు. ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. బండి సంజయ్ అరెస్ట్‌పై భిన్న వాదనలు విపిస్తున్నారు. ప్రతిపక్ష బిజెపి నుంచి నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో వాట్సప్‌నకు మెసేజ్ చేస్తే,, ఆ మెస్సేజ్ చూసినంత మాత్రానికే కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా.. ? అని బిజెపి నాయకులు భగ్గుమంటున్నారు.

వరంగల్ పోలీసులు మాత్రం ఇవేవీ తమకు పట్టవన్నట్లుగా పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. బండి సంజయ్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది. బండిని ఎందుకు ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారనే ప్రశ్నలకు పోలీసుల నుండి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే ఎస్‌ఎస్‌సి హిందీ పేపర్ లీక్స్‌లో వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి. అందుకే అదుపులోకి తీసుకున్నాం అన్నారు. పూర్తి స్దాయిలో ఆధారాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే సంజయ్ పై సెక్షన్ 420ఐపిసితో పాటు మాల్ ప్రాక్టీస్ యాక్ట్‌లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో బండి సంజయ్ వాట్సప్ చాటింగ్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హిందీ పేపర్ లీకైనట్లు వార్తలు సృష్టించి, తానే ఫొటో తీసిన కాపీని అన్ని గ్రూపులలో నిందితుడు ప్రశాంత్ షేర్ చేశాడు. అదే నిందితుడు తన ఫోన్ నుండి బండి సంజయ్ కు సైతం 11 గంటల దాటాక వాట్సప్ లో హిందీ పేపర్ బండి సంజయ్‌కు పంపించాడని, అతడు బీజేపీ కార్యకర్తనా కాదా అని హరీష్ రావు సైతం ప్రశ్నించారు.

ఈ కేసులో డొంక కదిలించేందు ప్రయత్నిస్తున్న వరంగల్ పోలీసులకు వాట్సప్ చాటింగ్ దొరికింది. దీంతో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ ను రీట్రీవ్ చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ కు ఒకరోజు ముందు బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ చేసినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తెలినట్లు సమాచారం. పేపర్ లీక్ ముందు బండి సంజయ్ , ప్రశాంత్ తో ఏ విషయంపై చాటింగ్ చేశాడు. వీరిద్దరి చాటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో 2 గంటల సమయంలో 142 సార్లు ప్రశాంత్ ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడు? కేవలం వాట్సప్ చాటింగ్ మాత్రమే కాదు ఏకంగా సంజయ్ తో వందకు పైగా ఫోన్ కాల్స్ ప్రశాంత్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హిందీ పేపర్ పంపిన తరువాత కూడా బండి సంజయ్, నిందితుడు ప్రశాంత్ ఫోన్ లో మాట్లాడినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే ప్రశాంత్ వాట్సప్ చాటింగ్ తో పాటు ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులు కోర్టుకు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.

హిందీ ఎగ్జామ్ మొదలైన కొంత సమయానికే నిందితుడు క్వశ్చన్ పేపర్ ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేశాడు. అందరి లాగే బండి సంజయ్ కు పేపర్ వాట్సప్ చేశాడని బిజెపి నేతలు చెబుతున్నారు. కానీ ఎగ్జామ్ ముందురోజు చాటింగ్, ఫోన్ కాల్స్, ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోనూ బండి సంజయ్, నిందితుడు ప్రశాంత్ ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారని మంత్రులు ఆరోపించారు. పేపర్ లీక్ తరువాత సరే , ఓ రోజు ముందు బండితో ప్రశాంత్‌కు ఏం పని, ఏం మాట్లడారు. పేపర్ లీక్ పై చర్చించారా? లేదా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్‌పై బిజెపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడు సైతం కావడంతో పేపర్ లీక్ కేసులో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఎగ్జామ్ పేపర్లు లీక్ కావడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రధాన నిందితుడు ప్రశాంత్ కు, బండి సంజయ్ కు లింకేంటి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News