ఎల్బీనగర్: పదో తరగతి తెలుగు, హిందీ పేపరు లీకేజీలతో గత కొన్ని రోజులుగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎల్బీనగర్ (బహుదుర్‌గూడ)లోని పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ పరిశీలించేందుకు లోపలకు వెళ్లే సమయంలో కమిషనర్ వద్ద మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించిన ఎల్బీనగర్ ఠాణా మహిళా కానిస్టేబుల్ కల్పన మొబైల్ ఫోన్‌తో లోపలికి వెళ్లవద్దని సూచించారు. దీంతో కమిషనర్ వెంటనే గేట్ వద్ద తన మొబైల్ ఫోన్‌ను కానిస్టేబుల్ ఇచ్చి లోపలికి వెళ్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలలోకి చరవాణిలు ఎవ్వరికి అనుమతి లేదని డిఎస్ చౌహాన్ తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ ముఖ్యమని అందుకే అన్ని విధాలా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణంగా తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. కానిస్టేబుల్ కల్పనకు విధుల పట్ల ఉన్న నిబద్ధతకు కమిషనర్ మెచ్చుకొని రూ.500 రివార్డు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ, ఎల్బీనగర్ ఎసిపి శ్రీధర్‌రెడ్డి, అంజిరెడ్డి, ఎస్‌ఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.