ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, ఏఈఓ శ్రీ గోపాల్ రావు, సూపరింటెండెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకున్న ఆధ్యాత్మిక, భక్తి
సంగీత కార్యక్రమాలు…
శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం 10 నుండి 11 గంటల వరకు డాక్టర్ చంద్రశేఖర రావు బృందం “అశ్వమేధ యాగం” పై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీమతి అనుగ్రత బృందం ఆలపించిన ” రామ రామ రామాయ నర….., బావయామి రఘురామం…., రామ మంత్ర జపసో….” సంకీర్తనలు భక్తులను అలరించాయి. రాత్రి 7 గంటల నుండి శ్రీ రాముడు భాగవతర్ “సుందరకాండ” హరికథ పారాయణం నిర్వహించారు.